సుంకిశాల పనులకు ముహూర్తం దగ్గరపడుతోంది. ఇందుకు ఈ నెలలోనే శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. సుమారు రూ.1470 కోట్లతో చేపట్టే ఈ పనులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లో ముహూర్తం ఖరారు అయ్యే సూచనలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ముగిసింది.
సీఎం చేతుల మీదుగా 'సుంకిశాల' పనులకు ఈనెలలోనే శ్రీకారం! - Work on the Sunkishala project will begin this month in telangana
సుంకిశాల ప్రాజెక్టు పనులకు ఈనెలలోనే శ్రీకారం చుట్టనున్నారు. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం రోజుల్లో ముహూర్తం ఖరారు అయ్యే సూచనలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రెండు సంస్థలు పోటీ పడగా.. చివరకు ఎల్1గా నిలిచిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ పనులు దక్కించుకుంది. ఇటీవలే పనులకు సంబంధించి అనుమతి ఉత్తర్వులనూ ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటికే బడ్జెట్‌లో కూడా దాదాపు రూ.750 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్‌కు కృష్ణా నీటి తరలింపునకు పూర్తి భరోసా దక్కనుంది. ముఖ్యంగా నాగార్జునసాగర్‌లోని డెడ్‌స్టోరేజీ నుంచి జలాలను తీసుకొచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. గతంలోనే డీపీఆర్ సిద్ధం చేసినా... ప్రాజెక్టుకు మాత్రం అడుగులు పడలేదు. తాజాగా ప్రభుత్వం పచ్చజెండా ఊపడటంతో సంబంధిత పనులకు ముందడుగు పడింది.
ప్రస్తుతం నగరానికి కృష్ణా మూడు దశల ద్వారా రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. అయితే నాగార్జునసాగర్‌లో నీటి మట్టం తగ్గినప్పుడు పూర్తిస్థాయిలో జలాల తరలింపు కుదరడం లేదు. పుట్టంగండి వద్ద ఉన్న ప్రధాన పంపింగ్ కేంద్రానికి నీళ్లు అందకపోవడమే కారణం. దీంతో సాగర్ లోపలవరకు వెళ్లి అక్కడ నుంచి భారీ మోటార్లతో నీటిని తోడి పుట్టంగండి అప్రోచ్ ఛానెల్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ఇందుకు ఏటా జలమండలి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఇకపై సుంకిశాల ప్రాజెక్టుతో ఈ సమస్య తీరుతుందని అధికారులు చెబుతున్నారు. నేరుగా సాగర్ డెడ్ స్టోరేజీ వద్దే ప్రత్యేక పంపింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ నుంచి నీటిని తీసుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. అంతేకాక ప్రస్తుతం పుట్టంగండి పంపుహౌస్ నీటి పారుదల శాఖ పరిధిలో ఉంది. నగరానికి నీటిని తరలించడానికి దీనిని జలమండలి వినియోగించుకుంటోంది. ఫలితంగా పంపింగ్ కోసం అయ్యే విద్యుత్తు ఛార్జీల చెల్లింపు విషయంలో రెండు శాఖల మధ్య తరచూ వివాదం తలెత్తుతోంది. తాజా ప్రాజెక్టుతో ఈ సమస్యకు కూడా పరిష్కారం లభించనుందని అంటున్నారు. దీనితోపాటు నగరవాసుల తాగునీటికీ ఇబ్బంది లేకుండా డెడ్‌స్టోరేజీ నుంచి కూడా జలాలను సేకరించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అంటే సాగర్‌లో నీటి మట్టం 510 అడుగల కంటే తగ్గినా సరే నిరంతరాయంగా జలాలను తరలించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మండు వేసవిలో కూడా హైదరాబాద్‌కు కృష్ణా నీటిని నిరంతరాయంగా అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే, తొలుత ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన చేసే సమయంలో రూ.850 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. తర్వాత తీవ్ర జాప్యం కావడంతో ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది.