తెలంగాణ

telangana

ETV Bharat / state

Women's Day Special Story: అన్ని రంగాల్లో మగువలే.. సారథులు!!

అన్ని రంగాల్లో మేముసైతం అంటూ మహిళలు నేడు పోటీ పడుతున్నారు. ఇల్లాలి చదువు ఇంటికే కాదు.. ప్రపంచానికే వెలుగు అని చాటిచెబుతున్నారు. రాజకీయ, అధికార, పారిశ్రామిక రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. నగరంలో అలాంటి వారు ఎందరో మన చుట్టుపక్కల ఉన్నారు. జిల్లాను ఏలుతున్న  మహిళామణులు, రాజధాని జిల్లాల్లో మగువ  అక్షరాస్యత, ప్రత్యేక పరిస్థితుల్లో జైలు పాలై అక్కడ తమ భవితను తీర్చిదిద్దుకుంటున్న ఇంతుల గురించి  ఈ నెల 8న ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’   సందర్భంగా ‘ఈటీవీ భారత్’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

Women's Day Special Story
Women's Day Special Story

By

Published : Mar 8, 2022, 7:45 AM IST

రంగారెడ్డి జిల్లా.. రాష్ట్రంలో కీలకమైన ప్రాంతం..! జిల్లాలో కీలక విభాగాలకు చెందిన 15 శాఖలకు మహిళామణులే సారథ్యం వహిస్తున్నారు. వాటిలో కీలకమైన రెవెన్యూ సహా జిల్లా వైద్యారోగ్య, వ్యవసాయం, ఉద్యానవన వంటి ముఖ్యమైన శాఖలున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కువ విభాగాలకు మహిళలే అధికారులుగా ఉన్న జిల్లాగా రంగారెడ్డి గుర్తింపు సాధించింది. భూముల విషయంలో అత్యంత కీలకమైన జిల్లా. రెవెన్యూ పరంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన జిల్లాకు డీఆర్వోగా హరిప్రియ వ్యవహరిస్తున్నారు. రాజేంద్రనగర్‌ డివిజన్‌ రెవెన్యూ అధికారిణిగా కె.చంద్రకళ వ్యవహరిస్తున్నారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, గండిపేట వంటి కీలక మండలాలు ఆమె పరిధిలో ఉంటాయి. భూముల పరిరక్షణ విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లి విజయం సాధిస్తున్నారు.

రాజకీయంగానూ...మహిళా అధికారులే కాకుండా రాజకీయంగానూ మహిళలే సారథ్యం వహిస్తున్నారు. జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సబితారెడ్డి రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా తీగల అనితారెడ్డి ఉన్నారు.

సవాళ్లను ఎదుర్కోవడం గర్వంగా ఉంది

మహిళగా ఇంట్లో కుటుంబాన్ని చూసుకుంటూనే.. ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించాలి. జిల్లా స్థాయి అధికారిగా పనిచేస్తున్నప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు బాధ్యతగా నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నా. సిబ్బందితో కలిసి ఆరోగ్యసూచీలో జిల్లాను మెరుగైన స్థానంలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నా.

- స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో

కీలక బాధ్యతల్లో ఉన్న వారు

* జిల్లా రెవెన్యూ అధికారి - జేఎల్‌బీ హరిప్రియ
* రాజేంద్రనగర్‌ ఆర్డీవో - కె.చంద్రకళ
* షాద్‌నగర్‌ ఆర్డీవో - రాజేశ్వరి
* కలెక్టరేట్‌ పరిపాలన అధికారి - ప్రమీల
* ఇన్‌ఛార్జి సమాచార, పౌరసంబంధాల అధికారి - నార్ల పద్మశ్రీ
* వైద్యారోగ్య శాఖాధికారి - స్వరాజ్యలక్ష్మి
* వ్యవసాయాధికారి - జె.గీతారెడ్డి
* ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి - ఆర్‌.సునందరెడ్డి
* మహిళా సంక్షేమాధికారి - ఎన్‌.మోతీ
* మత్స్యశాఖాధికారి - సుకృతి
* సహకార అధికారి - ధాత్రిదేవి
* పౌరసరఫరాల మేనేజర్‌ - శ్యామలక్ష్మీదేవి
* మైనార్టీ సంక్షేమాధికారి - రత్నకుమారి
* బీసీ సంక్షేమాధికారి - విద్య
* ఎస్టీ సంక్షేమాధికారి - రాజేశ్వరి

సంస్కరణలకు జేజైలు

  • మహిళా ఖైదీలు జైల్లో ఉన్నంతకాలం మనోవ్యధతో ఉండి.. బయటకు వచ్చాక ఎలా జీవించాలో తెలీక అయోమయంలో ఉండకూదన్న భావనతో ఉన్నతాధికారులు ఆపరేషన్‌ పరివర్తన్‌ పేరుతో కొన్నేళ్లుగా సంస్కరణలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చంచల్‌గూడ జైలులో మహిళా ఖైదీలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించి ఉత్పత్తులు తయారు చేయిస్తున్నారు.
  • ప్రస్తుతం జైల్లో పిజ్జాలు.. బర్గర్లు ఇతర బేకరీ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. పెట్రోల్‌పంపులో పనిచేస్తున్నారు. పాఠశాలల విద్యార్థుల ఏకరూప దుస్తులు సైతం కుడుతున్నారు.
  • మహిళా ఖైదీలు గర్భిణిగా ఉన్నా లేదా నవజాత శిశువుతో జైలుకు వచ్చినా 5 ఏళ్ల వరకు చిన్నారుల సంరక్షణను జైలు అధికారులే పర్యవేక్షిస్తున్నారు. గర్భిణులైతే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అనంతరం తల్లులుగా మారిన మహిళాఖైదీలను జైలుకు తరలించి పిల్లలకు 5 ఏళ్ల వరకు లేదా వారి శిక్షాకాలం పూర్తయ్యే వరకూ సంరక్షణ బాధ్యతలు జైలు అధికారులే నిర్వహిస్తున్నారు. ఇలా చంచల్‌గూడ మహిళా జైల్లో ప్రస్తుతం 25మంది చిన్నారులు ఉంటున్నారు. వీరికి జైలు వైద్యుల ఆదేశాలతో ఉదయం ఫలహారం, భోజనంలో గుడ్డు, అరటి పండు, సెరిలాక్‌ వంటి పౌష్టికాహారం ఇప్పిస్తున్నారు. చిన్నారులకు విద్య నేర్పేందుకు పాఠశాల కూడా ఉంది. ‘మహిళా ఖైదీలు మళ్లీ నేరాలబాట పట్టకుండా కావాల్సిన ఉపాధి చూపుతున్నామని ఇప్పటి వరకు సత్ప్రవర్తనతో విడుదలైన 35మందికి పెట్రోల్‌ బంకుల్లో ఉద్యోగాలిప్పించాం’ అని ఐజీ రాజేష్‌ తెలిపారు.

ఇదీ చూడండి: మహిళలకు తెలంగాణ ఆర్టీసీ బంపర్‌ ఆఫర్

ABOUT THE AUTHOR

...view details