గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పథకం ఓ వరంగా మారింది. పొలం పనులు లేని సమయంలో ‘ఉపాధి’ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో ఈ పథకం కింద మొత్తం 1,35,91,079 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. అందులో 76,96,676(56.63) మంది మహిళలు, 58,94,403 మంది పురుషులు ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళలే ‘ఉపాధి’లో పైచేయి సాధిస్తున్నారని ఈ లెక్కలు రుజువు చేస్తున్నాయి. మొదట్లో పురుషులే ఈ పథకం కింద అధికంగా పనులకు వెళ్లేవారు. ప్రస్తుతం స్త్రీలు ఎక్కువగా ఈ పనులకు హాజరవుతున్నారు. గడిచిన మూడేళ్ల వ్యవధిలో మహిళల హాజరు పది నుంచి పన్నెండు శాతం మేరకు పెరిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు పొలంబాట పట్టిన మహిళలు... నేడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దూసుకుపోతున్నారు.
విపత్తు వేళ అండగా
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం రెండు పర్యాయాలు లాక్‌డౌన్‌ను విధించింది. ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్లిన వారు తిరిగి పల్లెబాట పట్టారు. అలాంటి వారికి ఏడాదిగా ఉపాధి పనులే ఆసరా అయ్యాయి. ఉన్న ఊరిలోనే ఉపాధి దొరుకుతుండటంతో కూలీలు వలసలు మానుకున్నారు. ఈ పథకం పనులకే ఎక్కువగా హాజరవుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.