Women Welfare Celebrations in Telangana :రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.... అతివలను భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరగనున్న వేడుకల్లో మంత్రులు పాల్గొననుండగా.... రాష్ట్రంలో నియోజకవర్గస్థాయిలో మహిళా సదస్సులు జరగనున్నాయి.
Telangana Decade Celebrations 2023 :రాష్ట్రంలో కొనసాగుతున్న ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. జూన్ 2న ప్రారంభమైన ఉత్సవాలు.... ఈ నెల 22 వరకు 21రోజుల పాటు రోజుకో శాఖ చొప్పున అధికార యంత్రాంగం కృషితో.... ప్రజాభాగస్వామ్యంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిదేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను రంగాల వారీగా ప్రజల ముందు నివేదిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనున్నారు.
మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మహిళా సంక్షేమ దినోత్సవం వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, పౌష్టికాహారం, కేసీఆర్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్, మహిళలకు వీఎల్ఆర్, షీ-టీమ్స్,వీ-హబ్ ఏర్పాటు, మహిళా ఉద్యోగినులకు ప్రసూతి సెలవులు పెంపుతో పాటు ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నారు.