Friendship is Eternal: ప్రతి ఒక్కరిలోనూ మార్పు సహజం. అదే విధంగా మనం ప్రాణంగా అభిమానించే స్నేహితుల ప్రవర్తనలోనూ అప్పుడప్పుడూ మార్పులు కనిపిస్తుంటాయి. అయితే అవి ఎలాంటి మార్పులో ముందు గమనించాల్సి ఉంటుంది. అంటే.. ఎప్పటిలా మీతో మాట్లాడకపోవడం, కావాలని మిమ్మల్ని దూరం పెట్టడం, మీరు కాల్ చేసినా కట్ చేయడం, మెసేజ్ చేసినా రిప్లై లేకపోవడం.. వారి ప్రవర్తనలో ఇలాంటి మార్పులు గమనించినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వారితో మాట్లాడడం మంచిదంటున్నారు నిపుణులు.
కారణమేంటో తెలుసుకోండి:ఈ క్రమంలో మీ కోపతాపాల్ని పక్కన పెట్టి.. మీ పట్ల తను అలా ప్రవర్తించడానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలియకుండా ఏదైనా పొరపాటు చేశారా? లేదంటే మీ స్నేహాన్ని జీర్ణించుకోలేని మూడో వ్యక్తి మీపై లేనిపోనివి కల్పించి చెప్పారా? అదీ కాదంటే తనే కావాలని అలా చేస్తోందా? ఇవన్నీ వారితో కూర్చొని మాట్లాడితేనే ఓ కొలిక్కి వస్తాయి. ఇక అసలు కారణం తెలిశాక.. పొరపాటు ఎవరిదైతే వారు క్షమాపణ కోరితే సమస్య సద్దుమణుగుతుంది.. స్నేహబంధం తిరిగి పరిమళిస్తుంది.
పంతాలకు పోవద్దు:పంతాలు, పట్టింపులు.. అనుబంధాల్ని దెబ్బతీస్తాయంటారు. స్నేహబంధానికీ ఇది వర్తిస్తుంది. అయితే కొంతమంది తమ స్నేహితులు తమను దూరం పెడుతున్నారని, వారి ప్రవర్తన రోజురోజుకీ మారిపోతోందని వారిపై ద్వేషం పెంచుకుంటారు. ‘తను నాకు ప్రాధాన్యమివ్వనప్పుడు.. నేను తనను పట్టించుకోను!’ అంటూ పంతాలకు పోతుంటారు.
ఇదే చినికి చినికి గాలివానలా మారుతుంది.. అనుబంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలోనే ఓపికతో వ్యవహరించాలంటున్నారు నిపుణులు. అవతలి వారు మిమ్మల్ని పట్టించుకోకపోయినా.. మీరు వారితో ఎప్పటిలాగే మెలగడం, వారి కోపం తగ్గాక వారితో మాట్లాడడం, నిజానిజాలు తెలుసుకోవడం.. వంటివి చేస్తే మీ స్నేహితురాలి ప్రవర్తనలో ఎందుకు మార్పులొస్తున్నాయో అర్థమవుతుంది. ఆపై ఇద్దరి మధ్య తలెత్తిన పొరపచ్ఛాల్ని సరిదిద్దుకొని తిరిగి కలిసిపోవచ్చు.