ఓ వైపు కరోనా మహమ్మారి... మరోవైపు ఆకలి బాధలు. ఇంటిల్లిపాదికి కరోనా సోకి వండుకోలేని దీన స్థితులు. మహమ్మారి కారణంగా అందరూ ఉన్నా ఒంటరి జీవితం. మరోవైపు పేదరికంలో మగ్గే బతుకులు. ఇంతటి కష్టకాలంలో కొందరు అన్నపూర్ణలు అమ్మల్లా ఆదుకుంటున్నారు. కరోనా బాధితుల ఇళ్లకే పోషకాలతో కూడిన భోజనాన్ని ఉచితంగా పంపుతున్నారు.
విదేశాల నుంచీ ఫోన్ చేస్తున్నారు...
మేం కష్టంలో ఉన్నప్పుడు మా వారి స్నేహితుడి సాయం వల్లే నిలదొక్కుకోగలిగాం. ఆ స్ఫూర్తితోనే నావంతు సేవ చేయాలనుకున్నా. మొదటి వేవ్‌లో రోజూ వేల మంది వలస కార్మికుల కడుపు నింపగలిగాం. ఇప్పుడు కరోనాతో హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి ఉచితంగా పోషకాహారం అందించాలని నిర్ణయించుకున్నాం. ఆర్థికంగా కష్టమే అయినా చేయగలిగినంతే చేద్దామని మొదలుపెట్టా. కొవిడ్ బాధితులకు ఇంటికే ఉచితంగా ఆహారం అందిస్తామనే విషయం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగానే మా వాళ్లకు భోజనం పంపండి ప్లీజ్... మేం డబ్బులు చెల్లిస్తాం అంటూ దేశవిదేశాల నుంచి వందల ఫోన్‌లు వస్తున్నాయి. అవసరం ఎంతుందో అప్పుడే అర్థమయ్యింది. మేం డబ్బులు తీసుకోం.... కోలుకున్నాక వారూ మరి కొందరికి సాయం చేయగలిగితే అదే మాకు సంతృప్తి. రోజూ 100-150 మందికి పంపిస్తున్నాం. కాకపోతే పంపిణీకి వాలంటీర్ల కొరత ఉంది. అవసరాన్ని బట్టి ఐదు నుంచి తొమ్మిది మంది పనిచేస్తున్నాం. విజయవాడ నగరం వరకూ ఏ ప్రాంతం నుంచి కాల్ చేసినా స్పందిస్తున్నాం.
- అడ్డగళ్ల లక్ష్మీ అన్నపూర్ణ,
మార్గం ఫౌండేషన్, 9094773333
ఆరునెలల పాపతో...
హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు వండుకోలేరు. చుట్టుపక్కల వారు భయంతో వండివ్వలేరు. అందుకే రోజూ ఓ పదిమందికైనా భోజనం ఇవ్వాలనుకుని ఈ కార్యక్రమం మొదలుపెట్టా. యాక్సెంచర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నా. నాకు ఆరునెలల పాప. తన బాగోగులూ చూసుకోవాలి. మరో పక్క పదకొండుకి విధులకు లాగిన్ అవ్వాలి. ఈ రెండూ సమన్వయం చేసుకుంటూ వంట పూర్తి చేస్తా. ముందు రోజు మాకు వచ్చిన ఫోనులు, స్నేహితులు, బంధువుల అభ్యర్థనలు అన్నీ కలిపి ఇరవై నుంచి ముప్పైమందికి రోజూ వండి పంపిస్తున్నా. నెగెటివ్ రిపోర్ట్ వచ్చేవరకూ ఆయా కుటుంబాలకు అండగా నిలబడతాం. ఈ విషయంలో మా వారు, ఇతర కుటుంబసభ్యుల సాయమందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఖర్చు మా సొంతం. ఎవరైనా ఈ రోజు మేం సాయమందిస్తాం అంటే...మాత్రం రోగులకు అదనంగా మాంసాహారాన్నీ పంపిస్తున్నా. వాలంటీర్లు లేకపోవడంతో డెలివరీకి కొంత ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఉప్పల్ పరిధిలోనే వీటిని అందిస్తున్నా. నేనేదో గొప్ప పని చేస్తున్నానని అనుకోవడం లేదు. కొంచెమే చేయగలుగుతున్నానని బాధపడుతున్నా.
- డి.అలేఖ్య, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
పిల్లలకు ప్రత్యేకంగా...
ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం బాధ్యతగా భావిస్తున్నా. నిరుపేదల పరిస్థితి మరింత దారుణం. పని చేయకుంటే పూట గడవదు. పని చెయ్యాలంటే కరోనా చేయనివ్వదు. అందుకే కష్టమైనా మా పరిధిలో మేం బాధిత కుటుంబాలకు రోజూ ఉచిత భోజనం అందించాలని నిర్ణయించుకున్నాం. తలా ఓ చేయి వేస్తే ఈ కష్టకాలం నుంచి అందరం బయటపడొచ్చు. హైదరాబాద్‌లోని మియాపూర్, కూకట్‌పల్లి, ప్రగతినగర్... వంటి ప్రాంతాల వారు ఒక్క ఫోన్ చేస్తే చాలు ఇంటికే భోజనం తెచ్చిస్తాం. ఇంట్లో పిల్లలు ఉంటే ప్రత్యేక దృష్టితో వారికి పౌష్టికాహారం అందిస్తున్నాం. నేను చేసేది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావచ్చు. కానీ కొంత మందికైనా సాయపడగలుగుతాను కదా! ఆశ్రి సొసైటీ పేరుతో కొన్నాళ్లుగా సేవాకార్యక్రమాలు చేస్తున్నా. మా వారు కిషోర్‌రెడ్డి, మా అమ్మానాన్నలు కూడా ఈ పనుల్లో భాగం అయ్యారు.