Women Safety Tips Telugu :ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం.. ప్రేమను అంగీకరించాలంటూ వేధించడం.. ఒప్పుకోకపోతే చంపేయడం.. నేటి యువకులకు ఇదో ఫ్యాషన్ అయిపోయింది. కొన్నిసార్లు అమ్మాయి ప్రేమను అంగీకరించిన తర్వాత.. అసలు రంగు బయట పెడుతున్నారు. అసభ్యకరంగా ప్రవర్తించడం.. అసభ్యపదజాలంతో దూషించడం.. కొన్నిసార్లు కొట్టడం కూడా చేస్తుంటారు. అయితే ఇలాంటి టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటపడటానికి అమ్మాయిలు చాలా భయపడుతుంటారు. ఎవరేం అనుకుంటారోనని.. బ్రేకప్ చెప్పేస్తే బాయ్ ఫ్రెండ్ ఎలా రియాక్ట్ అవుతాడోనని ఆ టాక్సిక్ రిలేషన్‌షిప్‌కు గుడ్ బై చెప్పేందుకు జంకుతుంటారు. ఒక వేళ ఆ యువకుడు వేధించినా మౌనంగా భరిస్తారే తప్ప ఇంట్లో వాళ్లకు చెప్పుకోరు.
Women Safety Measures in Telugu :ఇలా తాము వేధింపులకు గురవుతున్న విషయాన్ని చాలా మంది అమ్మాయిలు ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఈ విషయాన్ని మొదట్లోనే ఇంట్లో వాళ్లకు చెబితే.. ప్రాణాలుపోయే వరకూ పరిస్థితులు రావని నిపుణులు అంటున్నారు. అసలు ప్రేమ పేరుతో ఎవరైనా తమను అప్రోచ్ అయినప్పుడు అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవ్వాలి. ఆ వ్యక్తి తనకు సరైన వాడేనని ఎలా తెలుసుకోవాలి..? ప్రేమించాడని చెప్పగానే ఓకే చెప్పినా.. ఆ తర్వాత వేధింపులకు గురి చేస్తే ఆ రిలేషన్ నుంచి ఎలా బయటపడాలి..? ప్రేమ వేధింపులకు గురయ్యే అమ్మాయిలు.. తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏం చేయాలి..? ఇలాంటి ఇబ్బందులు తమ కుమార్తె ఎదుర్కొంటుంటే.. ఆ సమయంలో తల్లిదండ్రులు ఆమెకు ఎలా అండగా నిలవాలి..? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
అమ్మాయిలూ మీరేం చేయాలంటే..?
- ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు ఎస్ చెప్పేముందే మీది తగిన వయసేనా అని ఒకసారి ఆలోచించుకోండి. తరచూ వారు వెంటపడుతున్నారనో.. మీ స్నేహితులను చూసో ప్రేమించకండి. ఒకవేళ నిజంగా మీకు నచ్చారు అనిపిస్తే తప్ప ముందడుగు వేయకండి. స్థిరపడే వరకు దీని గురించి ఆలోచించనని చెప్పండి. ఈలోగా అవతలి వారి వ్యక్తిత్వం గురించి మీరు తెలుసుకోగలుగుతారు. మీ భావనలపైనా మీకు స్పష్టత ఏర్పడుతుంది.
- ప్రేమించిన కొద్దిరోజులకే అతని తీరు మీకు నచ్చలేదు. ఫోన్‌నంబరు, సోషల్ మీడియాలో బ్లాక్ చేసి వారిని దూరంగా ఉంచడం కాదు. వారిని నేరుగా కలిసి ఇద్దరికి సరిపడదని దానికి సంబంధించిన కారణాలను వివరంగా చెప్పిండి. ఒకసారి వద్దు అనుకున్నాక వద్దే..! మళ్లీ స్నేహితులుగా కొనసాగడం, ఇద్దరికి కామన్‌గా ఉన్నవారి వేడుకలకి వెళ్లడం లాంటివి చేయొద్దు. మీ దగ్గర తనకు సంబంధించి ఎలాంటి వస్తువులున్నా తిరిగి ఇచ్చేయండి. మీకు ఏ అవసరమున్నా కాల్, మెసెజ్‌లు వంటివి చేయకండి. మీరు అలా చేస్తే తనపై ఇంకా ప్రేమ ఉందని పొరబడే అవకాశముంది. తీరా మీరు ఇంకా ఎవరినైనా ఇష్టపడితే మోసం చేశారని కోపం, పగ పెంచుకుంటారు.
- ఆ వ్యక్తి అస్సలే నచ్చలేదా..? దానికి కారణాన్ని వారికి స్పష్టంగా వివరించండి. మీరు మొహమాటపడితే అది మీకే ముప్పు. వారితో ధైర్యంగా, సూటిగా మాట్లాడండి. వీలైతే ఇంట్లోవారి సాయం తీసుకోండి. అర్థం చేసుకోరని మీకు అనుమానం ఉంటే పోలీసుల సహాయం తీసుకోండి. పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఫోన్‌కాల్ చేస్తే చాలు. షీ టీమ్‌ను ఆశ్రయిస్తే మీ వివరాలు బయటకు రాకుండా సమస్యను పరిష్కరిస్తారు. మనల్ని మనం సంరక్షించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొండి. ఇలాంటి వాటి పట్ల అవగాహన ఉండి నిర్ణయం తీసుకోవడం వల్ల మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన పనుండదు.