మహిళా భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగానే కళాశాలల్లో 'భద్రతా క్లబ్బు'లు ఏర్పాటు చేసింది. వీటి ప్రారంభ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా పాల్గొన్నారు.
ప్రయోగాత్మకంగా భద్రత క్లబ్బులు
హైదరాబాద్లోని 5 కళాశాలల్లో ప్రయోగాత్మకంగా భద్రత క్లబ్బులను ప్రారంభించారు. ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భద్రుక కళాశాల, అరోరా పీజీ కళాశాల, శ్రేయాస్ ఇంజనీరింగ్ కళాశాల, జాగృతి డిగ్రీ కళాశాలల్లో వీటిని ప్రారంభించారు. ఇప్పటికే ఆయా కళాశాలల్లో ఈ క్లబ్బులపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు.
45మందితో ఒక క్లబ్బు
ప్రతి కళాశాలలో 45మంది విద్యార్థులు కలిసి క్లబ్బుగా ఏర్పడతారు. వీరిలో విద్యార్థినిలతోపాటు విద్యార్థులు కూడా ఉంటారు. ఈ క్లబ్బుకు షీబృందాలు దిశా నిర్దేశం చేస్తాయి. కళాశాల యువతులు ఎదుర్కొనే ఇబ్బందులపై క్లబ్బులోని సభ్యులకు అవగాహన కల్పిస్తారు. షీ బృందాల ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆత్మరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి శిక్షణ ఇస్తారు. న్యాయ నిపుణులతో సదస్సులు నిర్వహిస్తారు. మహిళా భద్రతా విభాగం పనితీరు గురించి పూర్తి వివరాలు క్లబ్బులకు తెలియజేస్తారు.సేవ్ ద చిల్డ్రన్, లీడ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థలు వీరికి సహకారం అందిస్తున్నాయి.