తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరంలో చీకటి పడితే చాలు గల్లీకో గాంధారి పుత్రుడు.. - చీకటి పడితే చాలు గల్లీకో గాంధారి పుత్రుడు..

అర్ధరాత్రే కాదు.. కొంచెం చీకటి పడితే చాలు గల్లీకో గాంధారి పుత్రుడు.. వికృత చేష్టల కీచకులు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళల దగ్గరికి వెళ్లి బయటికి చెప్పుకోలేని మాటలతో బాధిస్తున్నారు. రాత్రిళ్లు పోలీసు నిఘా వాహనాలు నిరంతరం గస్తీ తిరుగుతున్నా.. అరెస్టులు, కఠిన శిక్షలు అమలవుతున్నా ఇంకా కొందరు మారట్లేదు.

women harassment in night time at Hyderabad
నగరంలో చీకటి పడితే చాలు గల్లీకో గాంధారి పుత్రుడు..

By

Published : Dec 26, 2019, 10:28 AM IST

ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు కూకట్‌పల్లి వెళ్లే బస్‌ కోసం ఎర్రగడ్డ బస్టాపు వద్ద ఎదురు చూస్తున్నాను.. ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి.. అసభ్యంగా మాట్లాడారు. ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెళ్లిపోయారు. వారన్న మాటలను ఎవరితో చెప్పుకోనూ..?’’-ఇది ఓ ప్రైవేటు ఉద్యోగిని ఆవేదన..

‘రాత్రి పదింటికి నా గదికి వెళ్లేందుకు స్నేహితురాలి కోసం అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద నిలుచున్నాను. ఇంతలో దాదాపు నలభై ఏళ్ల వ్యక్తి వచ్చి చెప్పుకోలేని విధంగా మాట్లాడాడు. పోలీసులకు ఫోన్‌ చేస్తాననగానే వెళ్లిపోయాడు. ఆ ప్రదేశంలో వాళ్లింటి అమ్మాయే ఉంటే ఏం చేస్తాడు.’’-నగరంలో బీటెక్‌ చదువుతున్న ఓ విద్యార్థిని ఆవేశం.

‘‘షేక్‌పేటలోని బేవరేజెస్‌ సంస్థలో పనిచేస్తాను. మా ఇంటికి వెళ్లే దారిలోనే ఓ మద్యం దుకాణముంది. రాత్రి ఎనిమిది గంటలకు విధులు ముగించుకొని వెళ్తుంటే ప్రతిరోజు అక్కడున్న మందుబాబుల అసభ్య దూషణలు, వెకిలి చూపులు తట్టుకోలేకపోతున్నాను. ఎవరికి చెప్పినా ఫలితం శూన్యం. నాలాగే చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు’’- ఓ ఉద్యోగిని ఆక్రందన ఇది.

ఇది కేవలం ఈ ముగ్గురి పరిస్థితి మాత్రమే కాదు. చెప్పుకోవడానికి ఇష్టపడని ఎందరో యువతులు నగరంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు ‘ఈనాడు- ఈటీవీభారత్​’ సర్వేలో వెల్లడైంది. యావత్‌ ప్రపంచాన్నే కదిలించిన దిశ హత్యాచార ఘటనానంతరం సైతం కొందరు మృగాళ్లలో ఏ మార్పు రాలేదన్న వాస్తవం స్పష్టమవుతోంది.

అసాంఘిక అడ్డాలే కారణం..!

నగరంలో రాత్రి తొమ్మిది దాటితే కొన్ని ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు, హిజ్రాలు రోడ్లపక్కన నిల్చుంటున్నారు. మెట్రో కేంద్రాలు, బస్టాపులను ప్రధాన కేంద్రాలుగా మార్చుకుని అనైతిక పనులకు పాల్పడుతున్నారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో కేంద్రాలు, పంజాగుట్టలోని నిమ్స్‌ ఆసుపత్రి బస్టాపుతో పాటు హైటెక్‌సిటీ తదితరాల్లో కొన్ని ప్రాంతాలు వీరికి అడ్డాలుగా మారుతున్నాయి. ప్రధాన రహదారుల వెంట గస్తీ పోలీసులు ప్రతిరోజు ఇలాంటివారిని అరెస్టు చేస్తున్నా వీరి దందా యథేచ్ఛగా సాగుతోంది. ఈ పరిస్థితి ఇతర మహిళలను ఇబ్బంది పెట్టేందుకు కారణమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మందుబాబులకు అడ్డే లేదు..

నగరంలో కొన్ని రద్దీ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, పర్మిట్‌ గదులను నిర్వహిస్తున్నారు. జనావాసాల మధ్యలో వీటిని ఏర్పాటు చేయడంతో మందుబాబులు రోడ్డుపైనే తాగుతూ కూర్చుంటున్నారు. అటుగా వెళ్లే మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీరిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యమని వాపోతున్నారు బాధితులు. దుకాణాల వద్ద తాగేందుకు అనుమతి ఇవ్వకూడదని తెలిసినా కొన్ని దుకాణాలు నిబంధనలు గాలికొదిలేస్తున్నాయి.

డయల్‌ 100..

నగరంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా.. ఏ సమయమైనా పోకిరీలు మీతో అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే 100కి డయల్‌ చేయాలని చెబుతున్నారు పోలీసులు. అప్పుడు చేసే పరిస్థితి లేకున్నా ఆకతాయిల వాహనం నంబర్‌, ఇతర వివరాలు చెప్తే వారిపై చర్య తీసుకుంటామని మహిళలకు భరోసా ఇస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details