కరోనా కాలంలో కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన మహిళలకు వ్యాక్సిన్ అందించడంలో వెనుకబాటు కనిపిస్తోంది. మహానగరంలోని మూడు జిల్లాల పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొవిడ్ టీకా తీసుకోవడంలో పురుషులతో పోల్చితే మహిళల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఇందుకు కారణాలు.. అవగాహన లేకపోవడం, చాలా ప్రాంతాల్లో ఇంటికి సమీపంలో కేంద్రాలు ఉండకపోవడం. రెండు, మూడు కిలోమీటర్ల వెళ్లాల్సి వస్తోంది. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కొన్ని కేంద్రాల్లో రోజుకు 50 డోసుల కంటే ఇవ్వటం లేదు. ఈ డోసులు అయిన తర్వాత మిగతా వారికి తర్వాత రోజు రావాలని సూచిస్తున్నారు. చాలామంది మహిళలు తీసుకోవటానికి జంకుతున్నారు.
చాలా కేంద్రాల్లో ఏ రోజు ఏ టీకా... ఏ డోసు ఇస్తారో కూడా తెలియదు. ఒకసారి మొదటి డోసు ఇస్తే... రెండో రోజు రెండో డోసు ఇస్తున్నారు. రెండో డోసు అవసరమైన వారు ఇంకో కేంద్రానికి వెళ్లాల్సివస్తోంది. ఇంట్లో పనులు వదులుకొని కేంద్రానికి వచ్చిన తర్వాత పట్టించుకునే వారు ఉండటం లేదని చెబుతున్నారు. హైదరాబాద్ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో మొదటి, రెండు కలిపి ఇప్పటి వరకు 35.18 లక్షల మందికి టీకాలు అందించారు. మహిళల కంటే పురుషులే ముందున్నారు. దాదాపు 4 లక్షల మంది అదనంగా వారు వ్యాక్సిన్ తీసుకున్నారు. రంగారెడ్డిలో కూడా అదే పరిస్థితి. మేడ్చల్‌లో మహిళల శాతం కాస్త మెరుగ్గా ఉంది.