సామాజిక మాధ్యమాలతో అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త!! పెరుగుతున్న టెక్నాలజీ వినియోగం సరిగా లేకుంటే... అది శాపంగా మారిందనే చెప్పాలి. పిల్లల విషయంలో దీని నష్టం మరింత ఎక్కువ. ఇంట్లో పిల్లలు అడగ్గానే ఫోన్ ఇవ్వడం... వాళ్లు దానితో ఏం చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులకు పట్టించుకోకపోవడం... ఏదో ఒకరోజు సమస్యలను తెచ్చిపెడుతుంది.
తాజాగా ఓ పదో తరగతి అమ్మాయికి ఓ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయమే ఆమె ప్రాణం తీసింది. ఏమి తెలియని వయస్సులో ఆ పరిచయాన్ని స్నేహం అనుకుంది.. ఆ యువతి. దాన్నే అదునుగా తీసుకున్న ఆ వ్యక్తి... ఎక్కడైనా కలుద్దాం అన్నాడు. అమ్మాయి ఒప్పుకోవడంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పుడే అతడిలో ఉన్న కామాంధుడు బయటకొచ్చాడు. లోబర్చుకునే ప్రయత్నం చేస్తుండగా... ఆమె ప్రతిఘటించింది. వెంటనే ఆ దుర్మార్గుడు బండరాయితో మోది హత్య చేశాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది.
పదో తరగతి అమ్మాయికి ఫేస్బుక్ అకౌంట్. సామాజిక మాధ్యమాల అవసరం వారి భవిష్యత్‌కు ఉపయోగపడేంతవరకు సబబే. కానీ అపరిచితులతో పరిచయాలు, వారితో చాటింగ్‌లు ఎప్పటికైనా ముప్పే. తెలిసీ తెలియని వయస్సుల్లోనే సామాజిక మాధ్యమాలను వాడటం సరికాదు. అమాయక యువతులను స్నేహం పేరుతో మోసం చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు.
మన పక్కనే ఉన్న స్నేహితులను, తల్లిదండ్రులను వదిలేసి... ఎవరో ఎక్కడో పరిచయం లేని స్నేహాలు ఎంత వరకు భద్రం అనేది ఒక్కసారి విద్యార్థులు, యువత ఆలోచించాలి. ముఖ్యంగా విద్యార్థులపై తల్లిదండ్రుల నిఘా అవసరం. తెలిసీ తెలియని వయసులో చిన్నారులు వేసే తప్పటడుగులు.. తల్లిదండ్రులకు జీవితాంతం కన్నీటినే మిగులుస్తాయి. మహబూబ్ నగర్ ఘటనే ఇందుకు ఉదాహరణ. కాబట్టి తల్లిదండ్రులూ ఒకసారి ఆలోచించండి.
ఇదీ చూడండి: లోబర్చుకోవాలనుకున్నాడు... హత్య చేశాడు...