Women Empowerment Through SERP : మహిళా లోకం ఆర్థిక స్వావలంబనను సాధిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల మహిళలు ఔత్సాహికవ్యాపారులు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఏటా పొదుపు పెరుగుతుండటంతోపాటు బ్యాంకులిచ్చే రుణాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగుతున్న తీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
హైదరాబాద్ బేగంపేట మ్యారీ గోల్డ్ హోటల్లో పేదరిక నిర్మూలన సంస్థ - సెర్ప్ ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ వార్షిక ప్రణాళిక ఆవిష్కరించారు. 2023-24 సంవత్సరం సంబంధించి రూ.15037.40 కోట్లు స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇవ్వాలన్న ప్రతిపాదనల మేరకు బ్యాంకు లింకేజీ వార్షిక ప్రణాళికను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
2023 మార్చి 31 నాటికి రూ.17,426 కోట్లకుపైగా రుణాలు బకాయి ఉన్న 3.77 లక్షలుపైగా గ్రామీణ పేదకుటుంబాలు బ్యాంకింగ్ వ్యవస్థ రూపంలోకి తీసుకురాబడ్డాయి. ఫలితంగా గ్రామీణ పేదల జీవనోపాధిలో గణనీయమైన మార్పు వచ్చింది. సెర్ప్ సహకారంతో అన్ని రకాల బ్యాంకులు అన్ని అర్హతగల సమూహాలకు రుణాలు అందించడం ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నాయి.
Women Development Through SERP : రాష్ట్రంలో 32 జిల్లాల్లో 98 శాతం మహిళలు భాగస్వాములుగా డ్వాక్రా సంఘాలు పని చేస్తున్నాయి. 553 మండల సమాఖ్యలు, 4,30,358 స్వయం సహాయక సంఘాల్లో 46,46,120 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. స్వయం సహాయక సంఘాల రుణ నిలువ ఈ ఏడాది 2023 మార్చి 31 నాటికి రూ.3,924.50 కోట్లుగా ఉంది. వార్షిక జీడీపీ వృద్ధి రేటు 15.6 శాతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో తెలంగాణ ఒకటి.
వేగవంతమైన వృద్ధి రేటు ఉన్నప్పటికీ దేశ జనాభాలో 13.74 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. ఇదొక కీలకమైన సవాల్. ఆర్థిక వృద్ధిని కలుపుకొని ఉండేలా చూసుకోవడం, పేదరికాన్ని గణనీయంగా తగ్గించడానికి సమ్మిళిత వృద్ధి అనేది రాష్ట్ర విధానం. జనాభాలో బలహీన వర్గాలు, ముఖ్యంగా గ్రామీణ పేద మహిళలకు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకురావడానికి రాష్ట్రం ప్రయత్నాలు చేస్తోంది. ఎస్‌హెచ్‌జీ-బీఎల్‌పీ కింద లక్ష కుటుంబాలను లక్ష స్వయం సహాయక సంఘాల ద్వారా కోటి రూపాయలు పైగా పొదుపు ద్వారా వార్షిక రుణం తీసుకుంటున్నాయి.