జీజీ హట్టి...ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రోళ్ల మండలంలోని ఓ చిన్న గ్రామం. ఆ ఊర్లో సుమారు 150 గడపలుంటాయి. ఆ జనాభాలో సగం మంది ఆడవాళ్లే. అయినప్పటికా పాతకాలం నాటి ఆచారాలను ఈ ఆధునిక యుగంలోనూ ఇంకా పాటిస్తున్నారు. మహిళలపై వివక్షను కొనసాగిస్తున్నారు..ఆ గ్రామస్థులు. నెలసరి సమయంలో, బాలింతగా ఉన్నప్పుడు ఆ ఊరి మహిళల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బాగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఆ సమయంలో వారినసలు ఇంట్లోనే ఉండనివ్వరు. ప్రతి నెలా రుతుక్రమంలో 3 రోజుల పాటు ఊరి బయట నిర్మించిన కమ్యూనిటీ హాల్లో ఉండాల్సిందే.
"నెలసరి సమయంలో ఊరి బయటనే ఉండాలి. వాళ్లు పెట్టిందే తినాలి. ఏమీ ముట్టుకోకూడదు. ఇలాంటివి పాటించడం కష్టంగానే ఉంటుంది కానీ మన మంచికే అని పాటిస్తున్నాం.. ఇది మా ఊరి ఆచారం."
-గ్రామస్థురాలు
ప్రతీ మహిళ జీవితంలో అమ్మ అవడం అనేది ఓ వరం. బిడ్డకు జన్మనివ్వటంతోనే...ఆడతనం...అమ్మతనం అవుతుందంటారు. వారి జీవితాల్లోనే ఎంతో మధురమైన అనుభూతిగా అందరూ భావిస్తారు.తల్లిబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాలి..సంరక్షించాలి. కానీ జిజి హట్టిలో మాత్రం..బిడ్డను ప్రసవించాక.. 2-3 నెలల పాటు తల్లీబిడ్డను ఇంట్లోకి రానివ్వరు. ఇంటి బయట ఓ గుడిసె ఏర్పాటు చేసి..పసిబిడ్డతో సహా అక్కడే ఉంచుతారు. వానలొచ్చినా, వరదలొచ్చినా అందులోనే ఉండాల్సిన దుస్థితి.
"ప్రసవం అయ్యాక బిడ్డతో సహా మూడు నెలల పాటు ఇంటి బయట ఏర్పాటు చేసిన గుడిసెలోనే ఉండాలి. రాత్రి పూట ఎవరైనా గుడిసె బయట ఉండొచ్చు కానీ లోపలికి రాకూడదు. పిల్లలని కూడా ముట్టుకోరు. చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం."
- గ్రామస్థురాలు