అనుకున్నది సాధించాలంటే అకుంఠిత దీక్ష, అందుకు తగ్గ నిరంతర శ్రమ అవసరం. అవి రెండూ అణువణువునా నిండిన మాధురి కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్‌లో చంద్రకాంత్ గోపాల్‌రావు, హేమలత దంపతులకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లల్లో ఒకరు. తండ్రి గోపాల్‌రావు రైల్వేవిభాగంలో ఇంజినీరు. తల్లి హేమలత అప్పట్లోనే డిగ్రీ చదివారు. పెళ్లైన తర్వాత గృహిణిగా ఉంటూ, తమ ముగ్గురు ఆడపిల్లలను ఉన్నత లక్ష్యాలవైపు నడిపించారు.
నాన్నకు చెప్పకుండా..!
డాక్టర్ అవ్వాలన్నది మాధురి చిన్ననాటి కల. పుణెలోని ఫెర్గుసన్ కళాశాలలో ఇంటర్ చదివేటప్పుడే ఆమె స్నేహితులు కొందరు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉండేవారు. తరచూ వాళ్లను కలవడానికి అక్కడికి వెళ్లేవారు. ఆ వాతావరణం తనని బాగా ప్రభావితం చేసింది. తప్పకుండా సైన్యంలోనే వైద్యసేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కళాశాల(ఏఎఫ్‌ఎంసీ)లో చేరాలనుకున్నారు. అక్కడికి వెళ్లి అందులో చదివేవారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. ఏఎఫ్‌ఎంసీలో చేరతానంటే తొలుత వాళ్ల నాన్న ఒప్పుకోలేదు. పుణె బీజీ మెడికల్ కాలేజీలో చేరాల్సిన ఆమె తండ్రికి చెప్పకుండా ఏఎఫ్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. సీటు వచ్చింది. ఆ తర్వాత వివరాలతో ఇంటికి ఉత్తరం రాశారు. మిలటరీ అంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయని అందరూ వద్దన్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. అమ్మ తనకు మద్దతు పలకింది.. తర్వాత నాన్న ఓకే అన్నారు. అలా పీడియాట్రిషన్ అయ్యారు. ఆర్మీ వైద్యకళాశాలల్లో, ఆసుపత్రుల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. లెఫ్టినెంట్ కల్నల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.
"మహిళలందరూ సవ్యసాచులే. వారిలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటాయి. వారిలోని శక్తియుక్తులను గుర్తించి, సాన పెడితే చాలు. మహిళలు అనుకున్న లక్ష్యాలను అలవోకగా సాధిస్తారు."