చార్మినార్.. ఈ పేరు వినగానే అద్భుత చారిత్రక కట్టడాలు కళ్లముందు కదలాడుతాయి. ముత్యాలు, గాజులు, వస్త్రాలు, అత్తర్లు... ఇలా మగువల మనసు దోచేవెన్నో. అతివల అందానికి మరింత మెరుగులు అద్దుతూ... సౌభాగ్యానికి ప్రతీకగా భావించేవే గాజులు. రకరకాల గాజులన్నీ ఒకే దగ్గర దొరికితే ఆనందానికి హద్దేముంటుంది. భాగ్యనగరంలోనే గాజుల అమ్మకాలకు ప్రతీతి లాడ్ బజార్. మగవారు వచ్చినా తమకిష్టమైన వారికి ప్రేమ పూర్వకంగా బహూకరించేందుకు కొనుగోలు చేస్తుంటారు. ఇన్నాళ్లు ఈ బజార్ గురించి తెలియనివారు అటువైపు వెళితే ఓ లుక్కేయాల్సిందే..
గాజులకు అడ్డా లాడ్‌బజార్:
భారతీయ స్త్రీల జీవితంలో ప్రధాన పాత్ర పోషించేవి గాజులు. ఎలాంటి వేడుకల్లో అయినా అతివలు అలంకరణలో భాగంగా గాజులు ధరిస్తారు. ఆకట్టుకునే గాజులకు అడ్డా అంటే చార్మినార్‌లోని లాడ్ బజార్. 400 ఏళ్ల క్రితం ఆరో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భార్య లాడ్లీ బేగం పేరుతో ఈ ప్రాంతం ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు.
సామాన్యులే కాదు.. ప్రముఖులు కూడా
లాడ్లీ బేగం వివాహానికి అతిథుల కోసం ఈ లాడ్ బజార్‌ను ఆమె తండ్రి ఏర్పాటు చేశారని అంటారు. మొత్తంగా ఇక్కడి గాజులు నగరవాసులనే కాకుండా దేశవిదేశాల మగువల మనసు దోచుకుంటున్నాయి. ఇటీవల ట్రంప్ కుమార్తె ఇవాంక కోసం చాలా మంది వ్యాపారులు ప్రత్యేకంగా గాజలు తయారుచేసి బహుకరించారు. గతంలో ప్రధానులూ సినీతారాలూ ఇక్కడే గాజులు కొనుగోలు చేశారు. చార్మినార్ పక్కనే ఉన్న ఈ ప్రదేశం కిలోమీటర్ వరకు విస్తరించి ఉంటుంది.