తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్నిమాపక శాఖలో అతివలకు చోటేది? - no chance for women in TS Fire department

Telangana Fire Department: రాష్ట్రంలో అగ్నిమాపక నోటిఫికేషన్​లలో మహిళలకు అవకాశం ఇవ్వడం లేదు. పొరుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా మహిళలు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌లో సేవలు అందిస్తున్నారు. 26/11 దాడుల అనుభవంతో ప్రత్యేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖలో యువతులు, మహిళలను ఎక్కువగా నియమించాలని నిర్ణయించింది. తెలంగాణలో మాత్రం ఆ ఊసే లేకపోవడం గమనార్హం.

fire department
fire department

By

Published : Dec 5, 2022, 7:58 AM IST

Updated : Dec 5, 2022, 9:03 AM IST

Telangana Fire Department: పోలీసు ఉద్యోగాలు సహా అనేక క్లిష్టమైన విధుల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. అయినా పోలీస్‌శాఖలో అంతర్భాగమైన అగ్నిమాపకశాఖలో మహిళలకు రాష్ట్రంలో ప్రాతినిధ్యమే లేదు. రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్క మహిళ కూడా ఫైర్‌ ఉమన్‌, ఎస్సై, అధికారిగా లేరు. ఆయా ఉద్యోగ నోటిఫికేషన్లలో మహిళల అంశాన్నే ప్రస్తావించడంలేదు. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఫైర్‌ ఫైటర్లుగా మహిళలు, యువతులు దూసుకెళ్తున్నారు. దేశ రాజధాని దిల్లీలో ఫైర్‌ ఉమెన్‌ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ జారీ కాబోతోంది. అయినా రాష్ట్రంలో ఆ ఊసే లేకపోవడం గమనార్హం. పోలీస్‌శాఖలో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు 33 శాతం రిజర్వేషన్లతో పోస్టులు భర్తీ చేస్తున్నా.. అగ్నిమాపకశాఖలో వివక్ష ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నాలుగుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా:రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఈ శాఖలో ఫైర్‌మెన్‌, ఎస్సైలు, సిబ్బంది నియామకాలకు 2015, 2018, 2020 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా పోలీస్‌శాఖలో కానిస్టేబుళ్లు, ఎస్సైల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులోనే అగ్నిమాపకశాఖ పోస్టులనూ భర్తీ చేస్తున్నారు. ఏ నోటిఫికేషన్‌లోనూ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌లో మహిళలకు అవకాశం కల్పించలేదు. ఈ ఏడాది నోటిఫికేషన్‌లో ఫైర్‌మెన్‌, డ్రైవర్‌ పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని షరతు విధించారు.

  • అగ్నిమాపకశాఖలో 19 ఏళ్ల క్రితమే మహిళా అధికారులను నియమించి ఈ విషయంలో దేశంలోనే తొలి రాష్ట్రంగా తమిళనాడు గుర్తింపు పొందింది. ఫైర్‌ డీఎస్పీ హోదాలో ఓ మహిళా అధికారి సైతం అక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
  • రాజస్థాన్‌లో పదహారేళ్ల నుంచి అగ్నిమాపక శాఖలో ఫైర్‌ ఉమెన్‌, ఎస్సైలుగా మహిళలను నియమిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో కొత్తగా 155 మంది ఫైర్‌ఉమెన్‌ను నియమించారు.
  • గుజరాత్‌లో పదమూడేళ్ల నుంచి అగ్నిమాపకశాఖలో మహిళా ఉద్యోగ నియామకాలు కొనసాగుతున్నాయి. రాజధాని గాంధీనగర్‌తోపాటు జిల్లా కేంద్రాల్లోని అగ్నిమాపక కేంద్రాల్లో మహిళలు విధులు నిర్వహిస్తున్నారు.
  • ముంబయి ఫైర్‌ బ్రిగేడ్‌లో నాలుగు నెలల క్రితం ఇద్దరు మహిళలను అగ్నిమాపక కేంద్ర అధికారులు (ఫైర్‌ ఇన్‌స్పెక్టర్లు)గా నియమించారు. 26/11 ఉగ్ర దాడుల అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపకశాఖలో యువతులు, మహిళలను ఎక్కువగా నియమించాలని నిర్ణయించింది. ఉగ్రదాడులతో పాటు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు బాధితుల్లో మహిళలు, చిన్నారులుంటే వారిని మహిళా అధికారులు సులభంగా రక్షించడానికి వీలవుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Last Updated : Dec 5, 2022, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details