Winter has started in Telangana: ఈ ఏడాది తెలంగాణలో ముందుగానే చలి మొదలైంది. ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు తగ్గడంతో శీతల వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నవంబరు రెండో వారం చివరి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇప్పుడు మూడు వారాల ముందే ఆ పరిస్థితి మొదలైంది. ముఖ్యంగా గత 4 రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘రష్యా, కజకిస్థాన్ సమీపంలోని కాస్పియన్ సముద్రం మీదుగా గాలుల ద్రోణి అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఉత్తర భారతం మీదుగా తెలంగాణ వరకూ విస్తరించింది. దీనివల్ల పశ్చిమ గాలుల్లో అస్థిరత ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను బంగ్లాదేశ్ తీరం వైపు వెళ్తూ గాలిలోని తేమనంతా పీల్చేయడంతో పొడివాతావరణం ఏర్పడి వర్షాలు తగ్గిపోయాయి’’ అని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణి వివరించారు. హైదరాబాద్ శివారు హకీంపేటలో గాలిలో తేమ సాధారణంగా 73 శాతం ఉండాలని, ప్రస్తుతం 54కి పడిపోవడం ఈ ప్రభావమేనని ఆమె ఉదహరించారు. నల్గొండలోనూ సాధారణంకన్నా 21 శాతం తగ్గిందని పేర్కొన్నారు.
4,5 డిగ్రీలు తక్కువగా...ఈ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామంలో 11.6, హైదరాబాద్ నగరంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.6 డిగ్రీలు తక్కువ. మెదక్‌లో 5.4 డిగ్రీలు తక్కువగా ఉంది.
తగ్గిన విద్యుత్తు వినియోగం..చలి వాతావరణంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్తు వినియోగం పడిపోయింది. బుధవారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో రాష్ట్ర విద్యుత్ డిమాండు 6,875 మెగావాట్లకు పడిపోయింది. కొద్దిరోజుల క్రితం 13 వేల మెగావాట్లుండటం గమనార్హం. సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీలు తగ్గినప్పుడు వాతావరణంలో అసాధారణ మార్పులు వస్తుంటాయి. గత ఐదురోజులుగా పశ్చిమ భారతం నుంచి వస్తున్న గాలుల్లో అస్థిరత కూడా శీతల వాతావరణానికి మరో కారణం. బుధవారం నుంచి తూర్పు, ఈశాన్య ప్రాంతాల మీదుగా గాలులు రావడం ప్రారంభమైనందున రాబోయే వారం రోజులు చలి పెరిగే అవకాశాలు లేవు. నవంబరు రెండో వారం నుంచి మాత్రం తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణి వివరించారు.