Wings India Hyderabad 2024 :విమాన రంగానికి మరింత ఊతమిచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా ప్రదర్శనకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం ముస్తాబవుతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వింగ్స్ ఇండియా కార్యక్రమం నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలు కనువిందు చేయనున్నాయి. విమానయానానికి ప్రజలను మరింత చేరువ చేయడంతో పాటు ఈ రంగానికి ఉన్న అవకాశాలను వ్యాపారవేత్తలకు, అంకుర పరిశ్రమలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
Wings India 2024 Air Show In Begumpet: వైమానిక రంగంలో ప్రపంచంలోనే ఇండియా మూడో అతిపెద్ద దేశంగా ఎదుగుతోంది. ఒక నగరం నుంచి ఇంకో నగరానికి విమానంలో ప్రయాణించే వాళ్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. 1748 విదేశీ విమానాలతో పాటు 1440 దేశీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో వెయ్యి విమానాలు భారత పౌర విమానయాన రంగంలో చేరుతాయనేది అంచనా. 2028 సంవత్సరానికి దేశానికి వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 3కోట్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 184 జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి.
ఆకట్టుకున్న ఎయిర్ షో.. అబ్బురపరిచిన వైమానిక విన్యాసాలు
మరో ఏడాదిలో దాదాపు 40 విమానాశ్రయాలను కొత్తగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. క్రిషి ఉడాన్ 2.0 స్కీం కింద ఇప్పటికే దేశంలోని 29 రాష్ట్రాలకు విమాన సౌకర్యం కల్పించారు. వైద్యం కోసం విదేశాల నుంచి వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. 21శాతం వృద్ధి కనిపిస్తోంది. పదేళ్ల వ్యవధిలో పర్యాటక రంగం, వైమానిక రంగం నుంచి వచ్చే ఆదాయం 119 బిలియన్ డాలర్ల నుంచి 270 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పలు వైమానిక సంస్థలు ముందుకొస్తున్నాయి.