ఎరువులు విదేశాల నుంచి నౌకల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ తీర ప్రాంత ఓడరేవులకు వస్తున్నాయి. అక్కడి నుంచి గూడ్సు రైళ్లు, లారీల్లో తెలంగాణలోని అన్ని జిల్లాలకు పంపుతున్నారు. రవాణా ఛార్జీలను వసూలు చేయకుండా ఎరువులను గ్రామాల్లోని దుకాణాల వద్దకు పంపాలని కోరుతున్న ఎరువులశాఖ, ఆ మేరకు ఛార్జీలను కంపెనీలకు చెల్లిస్తోంది. ఆ సొమ్మును కంపెనీలు టోకు వ్యాపారులకు ఇస్తున్నాయి కూడా. ఆ మేరకు 45 కిలోల బస్తాను ‘గరిష్ఠ చిల్లర ధర’(ఎమ్మార్పీ) రూ.266.50కే అమ్మాల్సి ఉంటుంది.
టోకు వ్యాపారులు మాత్రం రవాణా ఛార్జీల సొమ్మును చిల్లర వ్యాపారులకు ఇవ్వడం లేదని సమాచారం. ఇదే అదునుగా గ్రామీణ వ్యాపారులు బస్తా యూరియాపై రైతుల నుంచి రూ.30-50 అదనంగా వసూలు చేస్తున్నారు. ‘లారీల కిరాయిలు మేమే కట్టుకోవాల్సి వస్తోంది. ఆ సొమ్మునే రైతుల నుంచి వసూలు చేస్తున్నామని వరంగల్ జిల్లాకు చెందిన ఓ చిల్లర వ్యాపారి ‘తెలిపారు. డీజిల్ ధరలు పెరిగినందున రవాణా ఛార్జీల భారం పెరిగిందని ఆయన స్పష్టం చేశారు.
పోర్టల్‌కు... వాస్తవానికి పొంతనేది?
నిజానికి ఎరువును ఏ వ్యాపారి అమ్మినా వెంటనే ‘ఎరువుల పర్యవేక్షణ విభాగం’(ఎఫ్‌ఎంఎస్) పోర్టల్‌లో నమోదు చేయాలి. ఈ పోర్టల్‌లో ఉన్న వివరాల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం 5.15 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం 3.50 లక్షల టన్నుల నిల్వలున్నట్టు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతోంది. పోర్టల్‌లో లెక్కల ప్రకారం రాష్ట్రంలో అధిక నిల్వలున్నాయని, అందుకే నిర్ణీత కోటాకన్నా లక్ష టన్నులు తక్కువగా సరఫరా చేసినట్లు కేంద్ర ఎరువులశాఖ వర్గాలు తెలిపాయి.