ఎందుకు ఆగింది?..
మెట్రోరైలు తొలిదశలో కారిడార్-2ను జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ తన నిధులతో ఈ పనులు పూర్తిచేయాలనేది ఒప్పందం. పాతబస్తీ మీదుగా మెట్రో వెళితే ప్రార్థనా స్థలాలు తొలగించాల్సి వస్తుందని అలైన్‌మెంట్ మార్చాలని ఎంఐఎం అడ్డుకుంది. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని మెట్రో అధికారులను ఆదేశించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించాక మొదట ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌నే మళ్లీ ఖరారు చేశారు. ఆ తర్వాత కూడా అభ్యంతరాలు వచ్చాయి. ఈ వ్యవహారం ఎటూ తేలకపోవడం.. మరోవైపు మిగతా మార్గాల్లో మెట్రో పనులు పూర్తికావడం.. నిర్మాణ వ్యయం పెరగడంతో పాతబస్తీ పనుల నుంచి ఎల్ అండ్ టీ మెట్రో వైదొలిగింది.
ఏడాది కిందటే నిర్ణయం..
నగరం మొత్తం మెట్రో పరుగులు తీస్తుండటం.. పాతబస్తీ వాసులు తమకెప్పుడు మెట్రో అంటూ అడుగుతుండటంతో ఎంఐఎంతో సహా అన్ని పార్టీలు పనులు పూర్తిచేయాలని కొన్నాళ్లుగా కోరుతున్నాయి. మిగిలిన ఈ పనులను సైతం ఎల్ అండ్‌టీనే పూర్తిచేసేలా సర్కారు ఆ సంస్థతో ఏడాది కిందటే సంప్రదింపులు జరిపింది. ఇప్పటికే అంచనాకు మించి ప్రాజెక్టుపై వ్యయం చేశామని.. సర్కారు ఆర్థిక సాయం చేస్తే చేపడతామని ఎల్ అండ్ టీ మెట్రో వర్గాలు అన్నాయి. ఇతర ప్రాజెక్టుల్లో అవకాశం ఇవ్వడమో.. మరో విధంగా ఆదుకుంటామని పనులు పూర్తిచేయాలని సర్కారు సూచించింది. ఎల్ అండ్‌టీ కూడా దాదాపుగా సుముఖత వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌తో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ లోపు సర్కారు ప్రాధాన్యాలు మారిపోయాయి. పాతబస్తీ మెట్రో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గం వెనక్కి వెళ్లిపోయింది. జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు బదులుగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మాత్రమే మెట్రో పూర్తిచేశారు. 11 కిలోమీటర్ల మార్గమే కావడంతో రోజువారీగా 10వేల మంది ప్రయాణించడం కూడా గగనంగా మారింది. తీవ్ర నష్టాల్లో నడుపుతున్నామని ఎల్ అండ్ టీ వర్గాలు అంటున్నాయి.