హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పరిధిలో రూ. 184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 754.38 మీటర్ల పొడవుగల బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దుర్గంచెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో బ్రిడ్జి నిర్మాణంతో మొత్తం 13 ఫౌండేషన్లు ఏర్పాటు చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
ప్రత్యేకంగా తెప్పించాం...
స్టే-కేబుళ్లను ఆస్ట్రీయా నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు పేర్కొన్నారు. దుర్గం చెరువు పరిసరాల్లోని పర్యావరణం దెబ్బతినకుండా ఇరువైపు ఒడ్లపై కేవలం 2 పిల్లర్ల సహాయంతో 735 మీటర్ల పొడువులో వంతెన నిర్మించారు. ఎల్ అండ్ టీ సంస్థ ఆధ్వర్యంలో ఈ తీగల వంతెన నిర్మాణంలో 8 దేశాల ఇంజనీర్లు పాలు పంచుకున్నారు.
మొట్టమొదటి హైదరాబాద్ సస్పెన్షన్ బ్రిడ్జి...
బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మాదాపూర్, జూబ్లీహిల్స్‌ల మధ్య గణనీయంగా దూరం తగ్గనున్నట్లు వివరించారు. రంగురంగుల విద్యుత్ కాంతులతో మొట్టమొదటి హైదరాబాద్ సస్పెన్షన్ బ్రిడ్జిగా పేరొందడం సహా పర్యాటక ప్రాంతంగా రూపొందనుందన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్, హైటెక్ సిటీకి కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఐకాన్‌గా రూపొందనుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ నెం 36, మాదాపూర్‌లపై ఒత్తిడి గణనీయంగా తగ్గనుందని వెల్లడించారు.
2 కి.మీ తగ్గనుంది...
జూబ్లీహిల్స్ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలికి దాదాపు 2 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుందన్నారు. పంజాగుట్ట నుంచి నానక్ రాంగూడలోని బాహ్యవలయ రహదారికి రోడ్ నెం.45 ద్వారా అతి సులభంగా చేరుకోవచ్చని ప్రకటించారు. బ్రిడ్జిలో సుమారు 40 వేల ఎల్ఈడీ లైట్లను అమర్చుతున్నట్లు తెలిపారు. బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం ప్రతి శని, ఆదివారాల్లో దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వాహనాలకు అనుమతించట్లేదన్నారు. ఆ రెండు రోజుల్లో కేవలం పర్యాటకులను మాత్రమే కాలినడకన బ్రిడ్జిపైకి అనుమతిస్తామన్నారు మేయర్ రామ్మోహన్.
ఇవీ చూడండి : ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఫీజులపై మార్గదర్శకాలు