దశాబ్దాల క్రితమే వారి మధ్య చిగురించిన ప్రేమకు కులం, ప్రాంతం అడ్డు రాలేదు. ఆయనది తమిళనాడు... ఆమెది రాజమహేంద్రవరం. ఇన్నేళ్లూ అన్యోన్యంగా జీవించారు. రేయింబవళ్లు శ్రమించి ఇద్దరు పిల్లలను పెంచి ప్రయోజకులను చేశారు. 'అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా' అన్నట్టు రెక్కలు మొలవగానే వారు ఎగిరిపోయారు. పత్నిని పక్షవాతం నుంచి విముక్తురాలిని చేయాలన్న ధ్యేయమే శ్వాసగా ఒంటరిపోరాటం చేస్తున్నారు... నాగరాజు.
నాగరాజుకు... రాజమహేంద్రవరానికి చెందిన రమణమ్మకు 40 ఏళ్ల క్రితం వివాహమైంది. తాడితోటలోని ఓ అల్యూమినియం కంపెనీలో నాగరాజు పనిచేసేవారు. ఈ జంటకు ఓ కొడుకు, ఓ కుమార్తె. వారిద్దరికీ పెళ్లిళ్లు చేశారు. ఉన్నంతలో ఆనందంగా బతుకుతున్న తరుణంలో... కష్టాల వలయం వీరిని చుట్టుముట్టింది. రమణమ్మకు పక్షవాతం వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేక... అద్దె కట్టకపోవటంతో యజమానులూ ఇంటి నుంచీ వెళ్లగొట్టారు. భార్యకు సపర్యలు చేస్తూ రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి కింద ప్లాట్‌ఫాంపైనే కాలం వెళ్లదీస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.