ఏపీలో భాజాపా, జనసేన కలిసి పోటీ చేస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో.. యువతకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఇరు పార్టీల దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. తమ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలా దౌర్జన్యాలకు పాల్పడితే ఎన్నికలు నిర్వహించటం ఎందుకని ప్రశ్నించారు. ఈ విషయాలను డీజీపీ, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. భయపెట్టి సాధించిన గెలుపు ఎప్పటికీ నిలవదన్నారు. వైకాపా బెదిరింపులను తట్టుకుని అభ్యర్థులు బలంగా నిలబడాలని సూచించారు. అభ్యర్థుల్లో ధైర్యం నింపేందుకు క్షేత్రస్థాయికి వెళ్తామని స్పష్టం చేశారు.
దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు
ఆంధ్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారన్నారు. పోలీసులు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదని ఆక్షేపించారు. నామినేషన్లు ఇచ్చాక పరిశీలనలో కూడా తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాళహస్తిలో కత్తిపోటు ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ఇంత అరాచకం, దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే జైలుశిక్ష అని ఆర్డినెన్స్ తెచ్చారు. వైకాపా నాయకులు డబ్బు, మద్యం పంచరు అనే హామీని సీఎం ఇస్తారా? అని జగన్ ను ప్రశ్నించారు.