తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీటిని ఆంధ్ర సర్కార్ తరలించుకుపోతుంటే సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదని పోతిరెడ్డిపాడు వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే వందల టీఎంసీల నీరు దోచుకున్నారని.. ఈ దోపిడీ ఇంకా విస్తరిస్తోందని మండిపడ్డారు. ఫలితంగా దక్షిణ తెలంగాణ నీరు ఎడారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నీటిని మనం వాడుకోకపోతే మన హక్కులను కోల్పోతామని స్పష్టం చేశారు.
దక్షిణ తెలంగాణ ఎండిపోతోంది..
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపులు మోటార్లు, రీ ఇంజనీరింగ్, రీ డిజైనింగ్ తప్ప ఏమి తెలియదని పేర్కొన్నారు. కృష్ణా నీళ్లు దోచుకుపోతే గోదావరి నీటిని ఎత్తిపోసి కమిషన్లు దోచుకోవాలని చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రెండు పంటలు పండిస్తుంటే మనం మాత్రం ఎండిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని నాగం అన్నారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశమయ్యాక కూడా ఏపీ సీఎం సంగమేశ్వర్ ప్రాజెక్టుకు జీవో ఇచ్చారని నాగం ఆక్షేపించారు.