మితం సర్వజన సమ్మతం.. అతి అనర్థదాయకమన్న సూక్తి యాంటీబయాటిక్ ఔషధాల వినియోగానికి కచ్చితంగా వర్తిస్తుంది. ప్రమాదకర సూక్ష్మక్రిములపై విరుచుకుపడే దివ్యాస్త్రాలుగా పేరొందిన ఈ మందులను.. విచ్చలవిడిగా వాడితే మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందన్నది చేదు నిజం.. జలుబు, దగ్గు వంటి ప్రతి చిన్న అనారోగ్యాలకు, చివరకు వైరల్ ఇన్‌ఫెక్షన్లకు సైతం యాంటీబయాటిక్స్‌ను ఇష్టారాజ్యంగా వాడుతూపోతే హానికర సూక్ష్మక్రిములు నిరోధకత పెంచుకొని మొండిఘటాల్లా తయారవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లోనూ ఔషధాలు సక్రమంగా పనిచేయకుండా అడ్డుకుంటున్నాయి. కచ్చితంగా ఇది పెనువిపత్తే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరిస్తోంది.
ఆర్థిక భారం కూడా..
2001-2015 మధ్య భారత్‌లో కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడకం 85లక్షల యూనిట్ల నుంచి 1.32కోట్ల యూనిట్ల వరకూ పెరిగిపోయిందని అంచనా. యాంటీబయాటిక్స్ సవ్యంగా పనిచేయని కారణంగా మన దేశంలో ఏటా ఏడులక్షల మందికి పైగానే మృతిచెందుతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి భారత్‌లో ఏటా 15లక్షల మంది.. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు కోటి మందికి పైగానే మరణించే అవకాశాలున్నాయని ఆందోళన వెలిబుచ్చింది. యాంటీబయాటిక్స్ పనిచేయని పరిస్థితుల్లో.. కుటుంబంలో వ్యక్తిని కోల్పోవడం లేదా ఎక్కువ రోజులు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సి రావడంతో ఆర్థిక భారం కూడా తీవ్రంగానే ఉంటుందని తెలిపింది.
నిరోధకత వ్యాప్తి ఎలా?
- కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు తదితరాల పెంపకంలోనూ అవసరానికి మించి యాంటీబయాటిక్స్ వినియోగిస్తున్నారు. ఫలితంగా వాటితో పాటు, వాటిని తిన్న మనుషుల్లోనూ ఆయా ఔషధాల పరంగా నిరోధకత(సవ్యంగా ప్రభావం చూపని స్థితి) పెరుగుతోంది.
- కొందరు వైద్యులు అవసరం లేకున్నా, కొన్నిసార్లు అవసరాలకు మించి యాంటీబయాటిక్స్ మందులను రాస్తుంటారు. మరికొందరు రోగులు సొంతంగానే వాటిని వాడుతుంటారు. వీటి వల్ల కూడా వారికి ఆ ఔషధాలు సక్రమంగా పనిచేయని దుస్థితి ఏర్పడుతుంది.
- సాధారణంగా యాంటీబయాటిక్స్‌ను వాడడం మొదలుపెట్టిన ఒకట్రెండు రోజుల్లోనే ఉపశమనం కలుగుతుంది. దీంతో వైద్యుడు సూచించినన్ని రోజులు వాడకుండా మధ్యలోనే ఆపేస్తుంటారు. ఈ క్రమంలో ఆయా ఔషధాలు తర్వాత ప్రభావం చూపని పరిస్థితి తలెత్తుతుంది.