NEXT DGP IN TELANGANA: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ - డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేందర్ రెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ మేరకు గతంలోనే.. సాధారణ పరిపాలనా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2018 ఏప్రిల్ నుంచి నాలుగేళ్లకుపైగా.. మహేందర్‌రెడ్డి డీజీపీగా బాధ్యతల్లో ఉన్నారు. నెలాఖరున పదవీ విరమణ చేయనున్న తరుణంలో తదుపరి పోలీస్ బాస్ ఎవరన్నది చర్చనీయాంశమైంది. ఐపీఎస్‌గా కనీసం 30 ఏళ్లు సర్వీసు ఉన్న డైరెక్టర్జనరల్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న వారికి డీజీపీలుగా అవకాశం ఉంటుంది.
మూడు పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు: వారి జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపితే.. అన్ని అంశాలను పరిశీలించి అందులో మూడు పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్రంలో డీజీపీ పోస్టుకు.. ప్రస్తుతం ఆరుగురు అధికారులు అర్హులుగా ఉన్నారు. 1989 బ్యాచ్ కు చెందిన ఉమేష్‌షరాఫ్, 1990 బ్యాచ్ కు చెందిన రవిగుప్తా, అంజనీకుమార్ డీజీ హోదాలో ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్, రాజీవ్‌రతన్.. 1992 బ్యాచ్ కు చెందిన జితేందర్ అదనపు డీజీ హోదాలో ఉన్నారు.
కొత్త డీజీపీ ఎంపికకు తొలుత రాష్ట్రప్రభుత్వం నుంచి ప్యానల్ జాబితా యూపీఎస్సీకి వెళ్లాల్సి ఉంది. సంప్రదాయం ప్రకారం చూస్తే ఆ ప్రక్రియ గడువుకు మూడ్నాలుగు నెలల ముందు నుంచే.. ప్రారంభం అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యూపీఎస్సీకి ప్రతిపాదనలు వెళ్లలేదు. ముఖ్యమంత్రి ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.