తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఒక్కరికొచ్చినా...  వారంతా బాధితులే..!

కరోనా కాటుతో గ్రేటర్​ హైదరాబాద్​లోని కుటుంబాలు అల్లకల్లోలం అవుతున్నాయి. కుటుంబంలో ఒక్కరికి వైరస్‌ అంటుకున్నా కుటుంబ సభ్యులందరూ బాధితులుగా మారుతున్నారు. కొన్ని కుటుంబాల్లో సభ్యులంతా ఆసుపత్రిలో, మరికొందరు గృహ నిర్బంధంలో ఉండాల్సి వస్తోంది. కొందరు చివరి చూపునకూ నోచుకోవడం లేదు. అంత్యక్రియలూ జీహెచ్‌ఎంసీ సిబ్బందే నిర్వహిస్తున్నారు. బుధవారం భాగ్యనగరంలో 11 కేసులు నమోదయ్యాయి.

Hyderabad latest news
Hyderabad latest news

By

Published : May 7, 2020, 8:14 AM IST

హైదరాబాద్​లో కరోనా మహమ్మారి రోజురోజూ విజృంభిస్తోంది. కుటుంబంలో ఒక్కరికి వైరస్‌ అంటుకున్నా కుటుంబ సభ్యులందరూ బాధితులుగా మారుతున్నారు. కార్వాన్‌ సబ్జిమండిలో వ్యాపారి (50)కి నాలుగు రోజుల క్రితం కరోనా సోకడం వల్ల గాంధీలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా జీహెచ్‌ఎంసీ సిబ్బందే అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇంటి ఇల్లాలు ఆసుపత్రిలో ఉంది. కుమారుడు (16), కుమార్తె(14) గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆ తండ్రికి తలకొరివి పెట్టే అవకాశం ఆ కుమారుడికి దక్కలేదు.

వనస్థలిపురంలో మరో ముగ్గురికి...

వనస్థలిపురంలో మరో ముగ్గురికి నిర్ధారణ అయినట్లు రంగారెడ్డి వైద్య ఉపవైద్యాధికారి భీంనాయక్‌ తెలిపారు. హయత్‌నగర్‌ డివిజన్‌ హుడాసాయినగర్‌లోని వృద్ధురాలికి, ఆమె నుంచి కుటుంబ సభ్యులకు సోకింది. ఇప్పటికే కుమార్తె కుటుంబంలో పలువురికి నిర్ధారణ కాగా తాజాగా కుమారుడి కుటుంబంలో కోడలు, మనవరాలు (3), మనవడు (5)కు సోకింది. ఈ కుటుంబంలో 9 మంది ఆసుపత్రిలో ఉన్నారు.

జిమ్‌ యజమానికి...

ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ వెనుక గురుమూర్తినగర్‌లోని ఓ జిమ్‌ యజమాని (48) వారంరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అమీర్‌పేటలో ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు కరోనా నిర్ధరణ పరీక్షలకు పంపగా బుధవారం పాజిటివ్‌గా తేలడం వల్ల గాంధీకి తరలించారు. అతని భార్య, కుమారుడిని క్వారంటైన్‌కు తరలించారు.

ఇద్దరు డయాలసిస్‌ రోగులకు...

ఎల్‌బీనగర్‌ లింగోజిగూడ డివిజన్‌లో ఇద్దరు డయాలసిస్‌ రోగులు కరోనా బారిన పడ్డారు. విశ్రాంత ఉద్యోగి (60) కిడ్నీ వ్యాధితో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. ఇంట్లో చిన్న కుమారుడు, కోడలు, వారి ఇద్దరి పిల్లలు ఉంటున్నారు. 4 రోజుల క్రితం అనారోగ్యంతో ఉస్మానియాకు తీసుకువెళ్లగా వ్యాధి నిర్ధారణ కావడం వల్ల గాంధీకి తరలించారు.

నాగోల్​లో ఒక్కరికి...

నాగోల్​ సాయినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో యువకుడికి (27) నిర్ధారణ అయింది. మలక్‌పేటలో ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. గత శనివారం ఆస్పత్రికి వెళ్తే జ్వరంగా ఉండటంతో నమూనాలు సేకరించి పంపగా కరోనా ఉన్నట్లు బుధవారం తేలడం వల్ల అతన్ని గాంధీకి తరలించారు. అతని తల్లి కూడా డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. తండ్రి (55), తల్లి (46), సోదరుడు (24) పెళ్లయిన సోదరి (29), ఆమె ఇద్దరు పిల్లలను (7, 5) గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details