భాగ్యనగరం.. రోజురోజుకు సరిహద్దులు చెరిపేస్తూ విస్తరిస్తున్న మహానగరం. ఇక్కడ దాదాపు కోటిన్నర మంది ప్రజలు నివసిస్తుండగా... ఆ సంఖ్య రానురాను మరింత పెరుగుతోంది. వీరిలో పొట్టకూటి కోసం వచ్చే ప్రజలతో పాటు... ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు... ఎంతో మందికి హైదరాబాద్ కలల నగరం. అలాంటి హైదరాబాద్‌లోని 150 డివిజన్ల పరిధిలో.. దాదాపు 74 లక్షల మందికి ఓట్ల హక్కు ఉంది. కానీ... ఓటు వినియోగంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఎన్నో విషయాల్లో.. అంతర్జాతీయంగా దూసుకుపోతున్న భాగ్యనగరంలో... ఏ ఎన్నికల్లోనైనా సరే నిర్లక్ష్యమే తాండవిస్తుంది. ఈ కారణంగానే పోలింగ్ 50 శాతానికి మించదు. గతకొన్ని ఎన్నికల పోలింగ్ సరళిని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తేటతెల్లమవుతుంది.
కేవలం 45 మంది మాత్రమే..
నగరంలో మొత్తం 100 మంది ఓటర్లల్లో కేవలం 45 మంది మాత్రమే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఈ కారణంగా.. 2002లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 41.22 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2009లో 42.95 శాతం పోలింగ్ నమోదవ్వగా... ఆ తర్వాత జరిగిన 2016లోనూ అదే తీరుగా... 45.27 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ వరుస ఎన్నికల్లో ఏనాడు పోలింగ్ 50 శాతానికి మించలేదు. ఈ గణాంకాలే నగర ఓటర్ల నిర్లక్ష్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఇక 2016 ఎన్నికలను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే... ఏకంగా 10 డివిజన్లల్లో 20 శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదయింది. 18 డివిజన్లల్లో 30 శాతం ఓటింగ్ దాటలేదు. ఇక 62 డివిజన్లల్లో....40 శాతం, 47 డివిజన్లలో 50 శాతం లోపు ఓటింగ్ జరిగింది. ఇలా హైదరాబాద్ నగరపాలక ఎన్నికల ఓటింగ్ శాతం..... చెన్నై, బెంగళూరు, ముంబయి, దిల్లీ మహానగర కార్పొరేషన్ల ఎన్నికలతో పోల్చితే చాలా తక్కువగా నమోదవుతుంది.
యువత దూరం..
ఈ ఎన్నికల్లో మరో కోణం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అదే ఎన్నికలకు యువత దూరంగా ఉండడం. అవును... జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు... మిగతా ఎన్నికలకు నగర యువత దూరంగా ఉంటుంది... తమకు పట్టనట్టు వ్యవహరిస్తుంది. రాజధాని నగరంలో సహజంగానే ఉద్యోగులు, విద్యావంతులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఎక్కువ. కానీ.... యువత నిర్లక్ష్యం కారణంగా.. ఇక్కడే ఓటింగ్ శాతం అత్యల్పంగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇందులోనూ... మధ్యతరగతి, పేదలు నివసిస్తున్న ప్రాంతాలు, బస్తీల్లో ఓటింగ్ ఎక్కువగా నమోదవుతుండగా... విద్యావంతులు, ధనవంతులుకు కేంద్రాలుగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ చాలా తక్కువగా ఉంటుంది.
పేదలు, రోజు కూలీలకు వెళ్లే వాళ్లతో పాటు... వయస్సు మీద పడి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు సైతం.... ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాలకు వరుస కడుతుండగా... ఓటు హక్కు విలువ తెలిసిన విద్యావంతులు, ఉద్యోగులు ఓటును వినియోగించుకోక పోవడం దురదృష్టం. ముఖ్యంగా గ్రేటర్‌లో దాదాపు 6 లక్షల మంది వరకు ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారని ఓ అంచనా... కాగా వీరిలో చాలా మందికి ఓటు ఉంది. కానీ.. వీరిలో కనీసం 10 శాతం మంది కూడా ఓటింగ్‌లో పాల్గొనడం లేదు. ఇక ధనవంతులు ఓటింగ్‌కు వరుసలో నిలుచునేందుకు నిరాశక్తత చూపిస్తున్నారంటున్న విశ్లేషకులు … ఓటు వేయడంలో ఉదాసీనత, నిరాసక్తతో పాటు వ్యక్తిగత, సంస్థాగత కారణాలను సాకులు చూపుతున్నారని విమర్శిస్తున్నారు. తెలియని వాళ్లకు చెప్పాల్సిన వాళ్లే... ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏలా ? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.