ప్రేమ అలుగుతుంది- బ్రతిమాలుకుంటారా లేదా అని. అల్లరి చేస్తుంది- భరిస్తారా లేదా అని. కోప్పడుతుంది-వదిలి ఉండగలరా అని. మారాం చేస్తుంది- గారాబం చేస్తారా లేదా అని. ఏడుస్తుంది-కన్నీళ్లు తుడుస్తారా లేదా అని. అప్పుడు నమ్ముతుంది... నడిమధ్యలో వదిలిపోయే బంధం కాదు.. బతికున్నన్నాళ్లు నడిపించే తోడు అని. ప్రేమ ఏదీ మనసులో పెట్టుకోదు... అబద్ధాలతో ఆనందించదు.. సత్యం చెబితే సంబరపడిపోతుంది. అన్నింటినీ భరిస్తుంది.. అందరినీ నమ్ముతుంది.. ప్రేమ ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది.
ప్రేమంటే ఏమిటి...?
అసలు ప్రేమంటే ఏమిటి.. దేవుడు కనిపిస్తే మనుషులంతా ఏకమై అడిగే ప్రశ్న ఇది.. అందుకే దేవుడు కనిపించకుండా తిరుగుతున్నాడనుకుంటా.. ఏదో చిత్రంలో ఓ రచయిత చెప్పించిన డైలాగు. ఎన్ని యుగాలు మారినా.. ప్రేమంటే ఇది అనే కచ్చితమైన నిర్వచనం లేదు. నీలో వెలితిగా ఉన్న స్థలంలో తనలా వచ్చి చేరి.. నిన్ను తనలా మార్చేదే ప్రేమంటే... ఒక్క మాటలో చెప్పాలంటే వెలితిగా ఉన్న జీవితంలో వెలుగులు నింపేదే ప్రేమ.
ప్రేమ ఇంద్రధనస్సు అయితే ఆ ఏడు రంగులూ-- ఆకర్షణ, అవగాహన, తాదాత్మ్యత, స్పర్శ, కామం, ఓదార్పు
--యండమూరి వీరేంద్రనాథ్
ప్రేమ నిజమైనదా.. అబద్ధమైనదా..
ప్రేమ నిజం.. అబద్ధమా అనేది ఉండదు.. ప్రేమంటేనే నిజమైంది! కానీ తెలుసుకోవాల్సింది ఒక్కటే.. మనం ప్రేమిస్తున్నామా.. ప్రేమిస్తున్నాం అనుకుంటున్నామా అని. ఏదో ఆశిస్తూ.. కోరింది దక్కించుకోడానికి చేసే ప్రయత్నానికి ప్రేమ రంగు పులిమితే.. అది తాత్కాలికమే. మోసం చెయ్యాలనే ఉద్దేశం మెదడులో పెట్టుకుని వలవేసి దక్కించుకున్న బంధం శాశ్వతం కాదు. అందులో రెండు జీవితాలు కచ్చితంగా ఇమడలేవు. తప్పు చేసినా.. ఒప్పు చేసినా.. ప్రతి మనిషి తెలుసు... తాను ఏమి చేస్తున్నాడో. సో.. అవసరాల కోసం ప్రేమ రంగును పులమొద్దు.. స్వచ్ఛమైన దానిని వదులుకోవద్దు.
ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం ఉంది ---రవీంద్రనాథ్ ఠాగూర్
ప్రేమిస్తున్నట్లు తెలుసుకోవడం ఎలా..?
మనిషి నిత్య జీవితంలో ఎందరినో చూస్తుంటాడు. శైశవం నుంచి కౌమారంలోకి అడుగుపెట్టే దశలో ఎంతో జ్ఞానం పొందుతాడు. మంచి చెడు మధ్య వ్యత్యాసం గుర్తిస్తాడు. ప్రేమ ఒక శాస్త్రం.. దానికి ప్రత్యేక గ్రంథాలు.. శిక్షణా తరగతులు ఏమీ లేవు.. గమనాలు లేని ప్రేమకు గమ్యం బంధం. దీనికి ప్రత్యేకమైన భాష లేదు. ఎక్కువగా ఇది వ్యక్తమయ్యేది మనల్ని కోరుకునే వారి చేతల్లోనూ.. చూపుల్లోనూ.. మనకోసం ఇచ్చే ప్రాధాన్యతలోనూ బహిర్గతమవుతుంది! అసత్య సమాజంలో నేడు కొందరు ప్రేమను వర్తకపు వస్తువుగా మార్చేస్తున్నారు. మనం కోరుకునే వాళ్లు మన పక్కనుంటే బాగుంటుంది అనిపించేదే ప్రేమ. ప్రేమ పుట్టిందంటే.. మరచిపోవడం ఉండదు!
లవ్ ప్రపోజ్ చేయడం ఎలా..?
ప్రేమ విషయంలో ప్రతి ఒక్కరు పక్కవాళ్ల కథలో హీరోలే. కానీ వారి కథలోనే జీరోలు. లైఫ్లో అన్నింటికంటే సులువైనది ప్రేమలో పడడం. అన్నింటికంటే కష్టం అది ప్రేమించిన వాళ్లకు చెప్పడం. జీవితంలో అన్ని పరీక్షలు కలిపి ఒకేసారి రాయాల్సినంత కష్టమైంది! కాకుంటే ధైర్యం ఏమిటంటే ప్రతి సబ్జెక్ట్ లవ్వే. సాధారణంగా గలగల మాట్లాడే వారే అయినా ఆ పదాలు రాక తడబడుతుంటారు. ఎంతటి ధైర్యవంతులైనా జంకుతూ ఉంటారు. మనకు పరిచయమున్నవారే.. మనతో బంధాన్ని కోరుకుంటున్న వారే అది వారి చేతల వల్లే తెలుస్తుంది. కానీ ఆ మూడక్షరాలు పలకడానికి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవేవి గుర్తుకురావు! చాలా మంది నోటితో చెప్పలేరు. కన్నీటితోనో... గాఢమైన కౌగిలితోనో వ్యక్తం చేస్తారు. ప్రేమను తెలపడానకి మాటలే కావాలా.. కోటి ఊసులను రెప్పపాటులో చెప్పే కనులు సరిపోవు!
ప్రేమించడానికి హృదయం ఉండాలి... ప్రేమింపబడడానికి వ్యక్తిత్వం ఉండాలి. ---- యండమూరి వీరేంద్రనాథ్
ఏది ప్రేమ... ఏది ఆకర్షణ..?
నేటి యువత చాలా తెలివైన వారు అనుకుంటూనే సులువుగా మోసపోతున్నారు. వ్యామోహమో.. ఆకర్షణో తెలియక దానికే ప్రేమ అనే రూపాన్ని ఇచ్చుకుని ఉచ్చులో చిక్కుకుంటున్నారు. అందంగా కనిపిస్తూ... ఆకట్టుకునేలా మాట్లాడినా... జల్సాగా ఖర్చు చేసినా... ఎదుటివాళ్లపై జోకులేస్తూ గొప్పలకు పోయినా ప్రేమించే వాళ్లను చూస్తుంటాం. ఒకళ్లు చూడగానే పడిపోయామంటారు.. ఇంకొకళ్లు చాలా నిశితంగా పరిశీలించి ప్రేమించామంటారు. ప్రేమకు ఇంత కాలం అంటూ ఉందా.. ఇలాగే ఉంటేనే ప్రేమించాలని రూలేమైనా ఉందా.. అది ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో వాళ్లకే తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మోసం చెయ్యాలి అని ఉన్న వాళ్లకు తాము చేస్తున్న తప్పేంటో తెలుసు. నిజాయతీగా ఉండేవాళ్లను మోసం చేయకండి.
లవ్లో ఉన్నట్టు తెలుసుకోవడం ఎలా..?
ఒకరు ప్రేమలో ఉన్నట్టు తెలుసుకోవడానికి ప్రత్యేక కొలమానాలు అంటూ ఏమీ లేవు. కానీ వాళ్లలో వచ్చిన మార్పులు కొట్టొచ్చినట్లు కనబడతాయి. తన భాగస్వామితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. అబద్ధాలు చెబుతారు. ఆకస్మికంగా మారిపోతారు. అకారణంగా నవ్వుకుంటారు. నలుగురిలో ఉన్నా కచ్చితంగా ఏదో ఆలోచిస్తూనే ఉంటారు. ఇవే కదా రేపు ఒక్కటైన తర్వాత గుర్తొచ్చి సంతోషపడే మధుర జ్ఞాపకాలు!
ప్రేమవల్ల, జ్ఞానం వల్ల జీవితం స్ఫూర్తి పొందుతుంది. --- బెర్ట్రాండ్ రస్సెల్స్.