కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఈనెల 3 నుంచి సుమారు 42 వేల మంది సెకండరీ కాంటాక్ట్‌లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కోర్టుకు తెలిపింది. హోటళ్లలో ఐసోలేషన్ పడకలు 857 నుంచి 2995కి పెరిగాయని వివరించింది. జిల్లాల్లో 86 కొవిడ్ కేర్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొంది. ఆస్పత్రుల్లో ప్రవేశాల ప్రక్రియ సులభతరమైందని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.
గందరగోళం లేకుండా చేశాం...
ప్రైవేట్ ఆస్పత్రులపై 50 ఫిర్యాదులు వచ్చాయని స్పష్టం చేసింది. 46 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపింది. షోకాజ్ నోటీసులకు 16 ఆస్పత్రులు వివరణ ఇచ్చాయని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. బులెటిన్‌లో గణాంకాల గందరగోళం లేకుండా చర్యలు తీసుకున్నామని బదులిచ్చింది. కరోనా మృతదేహాల తరలింపు కోసం 61 వాహనాలు ఉన్నాయని కోర్టుకు విన్నవించింది.
ప్రభుత్వం కన్నా అవే శక్తివంతమా ?
ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏం జరుగుతోందని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రులు... ప్రభుత్వం కన్నా శక్తివంతంగా కనిపిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యనించింది. షోకాజ్ నోటీసులకు 30 ఆస్పత్రులు కనీసం వివరణ ఇవ్వలేదని హైకోర్టు మొట్టికాయలు వేసింది. 50 ఫిర్యాదులు వస్తే కేవలం 2 ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. 50 శాతం పడకలు అధీనంలోకి తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రకటించారని గుర్తు చేసింది. మూడు రోజులుగా ఎలాంటి కదలిక కనిపించడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆ లీజులు ఎందుకు రద్దు చేయకూడదు...
ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆస్పత్రుల లీజులు ఎందుకు రద్దు చేయరాదని కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు బులెటిన్‌లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ పరీక్షల వివరాలేవని హైకోర్టు అడిగింది. కరోనా కేర్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయో ప్రజలకు సమాచారం ఎక్కడుందని మండిపడింది.
ఆ వివరాలపై సమాచారం ఏదీ ?
మృతదేహాలు తీసుకెళ్లే వాహనాల వివరాలపై ప్రజలకు సమాచారం ఎలా తెలియాలని హైకోర్టు అనుమానాలు లేవనెత్తింది. రాపిడ్ యాంటీ జెన్ పరీక్షల ఖచ్చితత్వాన్ని పరిశీలించారా అని సందేహం వ్యక్తం చేసింది. హితం యాప్ పై ప్రచారం ఎక్కడా కనిపించడం లేదని కోర్టు ఆక్షేపించింది. జిల్లాల్లో ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇవీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 1,931 కరోనా కేసులు నమోదు