తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొందరు కస్టమర్లకు రహస్య కోడింగ్.. వారికి స్పెషల్ ట్రీట్​మెంట్'

Banjara Hills Pub Case: రాడిసన్​ పబ్​లో డ్రగ్స్​ కలకలం రేగిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పబ్​లో ఉన్నవారు డ్రగ్స్ వినియోగించినట్లు తేలలేదని వెస్ట్​జోన్ డీసీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. కాగా... పబ్‌లో ఐదు ప్యాకెట్లలో 5 గ్రాముల కొకైన్ లభించినట్లు పేర్కొన్నారు.

Westzone DCP
Westzone DCP

By

Published : Apr 3, 2022, 7:43 PM IST

Updated : Apr 3, 2022, 8:50 PM IST

'పబ్​లో ఉన్నవారు డ్రగ్స్ వినియోగించినట్లు తేలలేదు'

Banjara Hills Pub Case: రాడిసన్ బ్లూ పబ్‌లో ఉన్నవారు డ్రగ్స్‌ తీసుకువచ్చినట్లు, వినియోగించినట్లు తేలలేదని వెస్ట్​జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. డ్రగ్స్‌ కేసులో పబ్‌లో ఉన్నవారిని బాధ్యులను చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పబ్‌లో ఉన్నవారి పాత్ర ఉందని దర్యాప్తులో తేలితే అరెస్టు చేస్తామని డీసీపీ వివరించారు. డ్రగ్స్‌ కట్టడికి తరచూ సమావేశాలు జరుగుతున్నాయన్న డీసీపీ... వీటి కట్టడికి ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. డ్రగ్స్‌ నిరోధానికి సీపీ సీవీ ఆనంద్‌ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారన్నారు. ప్రత్యేకంగా నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ ఏర్పాటు చేశారని వెల్లడించారు.

అవగాహన కల్పిస్తున్నాం:దర్యాప్తులో లోపాలున్నాయని నార్కోటిక్‌ సూపర్‌వైజరీ వింగ్‌ ఏర్పాటు చేశారన్న డీసీపీ... ప్రజల్లో అవగాహన కోసం కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పబ్‌లు, బార్లు, రెస్టారెంట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచుతున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రతి జోనల్‌ డీసీపీ పరిధిలో టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న డీసీపీ... పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌.. రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నడుపుతున్నారన్నారు.

'రాడిసన్​ పబ్​ యాజమాన్యం 24 గంటలపాటు పబ్‌ నిర్వహణకు లైసెన్స్‌ తీసుకున్నారు. పబ్‌లో డ్యాన్స్‌లు, డీజేలు నిర్వహిస్తున్నారు. పబ్‌లో ఉదయం 4 వరకు మద్యం, ఆహారం విక్రయిస్తున్నారు. పబ్‌లో డ్రగ్స్‌కు సంబంధించి సమాచారం అందింది. అర్ధరాత్రి 2 ప్రాంతంలో పబ్‌పై టాస్క్‌ఫోర్స్ బృందాల దాడి. పబ్‌లో 38 మంది మహిళలు సహా 148 మందిని గుర్తించాం. పబ్‌లో ఐదు ప్యాకెట్లలో 5 గ్రాముల కొకైన్ లభించింది.'

-- జోయల్ డేవిస్, వెస్ట్​జోన్ డీసీపీ

పబ్‌లో ఉన్న అందరి వివరాలు తీసుకున్నామని డీసీపీ జోయల్‌ డేవిస్‌ పేర్కొన్నారు. పుడింగ్‌ అండ్‌ మింక్ యజమాని అర్జున్‌, అభిషేక్‌పై కేసులు పెట్టినట్లు తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించి జనరల్‌ మేనేజర్‌ అనిల్‌పైనా కేసు పెట్టామన్నారు.

'జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించాం. పబ్‌లో గుర్తించిన 148 మందిపై నిఘా పెడతాం. యాప్‌ ఏర్పాటు చేసుకుని పరిమిత సంఖ్యలో చేర్చుకుంటున్నారు. యజమానులకు తెలిసిన 50 మందితో గ్రూప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. యాప్‌లో ఓటీపీ ద్వారా కోడ్‌ నమోదు చేసే ప్రవేశించేలా చూస్తున్నారు. వినియోగదారుడితో పాటు ఒకరిని అనుమతిస్తున్నారు. తక్కువ వినియోగదారులు ఉంటే అప్పటికప్పుడు చేర్చుకుంటున్నారు. గతంలోనూ పబ్‌పై పలుమార్లు దాడులు జరిగాయి. పబ్‌ యాజమాన్యం కూడా మధ్యలో మారింది. ఇవాళ రెడ్‌హ్యాండెడ్‌గా పబ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డారు.'

-- జోయల్ డేవిస్, వెస్ట్​జోన్ డీసీపీ

సంబంధిత కథనాలు..

Last Updated : Apr 3, 2022, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details