ఏటా మే 5న ‘వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే’ పేరిట చేతుల పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ అల్లకల్లోలం సృష్టిస్తోన్న నేపథ్యంలో చేతి పరిశుభ్రత గురించి మరింత అవగాహన పెంచే ఉద్దేశంతో ఈసారి ‘Seconds save lives – clean your hands’ అనే థీమ్‌తో మనముందుకొచ్చింది. చేతుల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా కడుక్కోవడం వల్ల కొవిడ్ వైరస్‌తో పాటు మన చుట్టూ ఉండే ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చని చెప్పడమే ఈ థీమ్ ముఖ్యోద్దేశం. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది పదే పదే చేతుల్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తపడచ్చని చెబుతోందీ సంస్థ. వీరితో పాటు ప్రతి ఒక్కరూ తమ చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యమివ్వాలంటోంది. ఈ నేపథ్యంలో సబ్బుతో చేతులను ఎంతసేపు కడగాలి? ఎలా శుభ్రం చేసుకోవాలి..? ఎప్పుడెప్పుడు చేతులు కడుక్కోవాలి..? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి.
ఎలా శుభ్రపరచుకోవాలి?
కరోనా వైరస్ కరచాలనం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుందన్న సంగతి తెలిసిందే. వైరస్ సోకిన వ్యక్తితో కరచాలనం (షేక్ హ్యాండ్) చేయడం, వైరస్ ఉన్న వ్యక్తి తాకిన వస్తువులనే మనమూ తాకడం.. ఇలాంటి పనుల వల్ల వైరస్ మన చేతులకు అంటుకుంటుంది. అయితే ఇదే చేతులతో కళ్లు, ముక్కును నలపడం.. భోంచేయడం.. వంటి వాటి వల్ల ఆ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే కరోనాను కట్టడి చేయాలంటే ముందు మనం దాని వ్యాప్తిని ఆపాలి. అది జరగాలంటే ఎవరి చేతులను వాళ్లు వీలైనంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులు, ప్రముఖ ఆరోగ్య సంస్థలు సైతం పదే పదే ఇదే మాటను చెబుతున్నాయి. ఈ క్రమంలో చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎంతసేపు శుభ్రం చేసుకోవాలో వాళ్లు సవివరంగా తెలిపారు.
* ముందు మీ చేతులను శుభ్రమైన నీటి (చల్లని/గోరువెచ్చని) ధార కింద ఉంచి వాటిని తడపాలి.
* ఇప్పుడు చేతులకు సబ్బు రాసి నురుగు వచ్చేలా రుద్దండి. ఈ క్రమంలో కేవలం అరిచేతులనే కాకుండా, వేళ్ల మధ్యన, చేతుల వెనక భాగంలో, గోళ్ల కింద.. ఇలా ప్రతి భాగాన్నీ బాగా రుద్దాలి.
* ఇప్పుడు నీటి ధార కింద చేతులను పెట్టి సబ్బు పూర్తిగా తొలగిపోయేంత వరకు శుభ్రంగా కడిగేసుకోవాలి. చివర్లో నీటి ధార కింద అరచేతులు పెట్టి కడుక్కోవడం మంచిది. దీనివల్ల ఏవైనా మలినాలు, సబ్బు అవశేషాలు మిగిలిపోతే నీటితో పాటు అవీ వెళ్లిపోతాయి.
* ఇప్పుడు శుభ్రమైన టవల్, రుమాలు, టిష్యూ పేపర్ లేదా ఎయిర్ డ్రయర్‌తో మీ చేతులను పొడిగా చేసుకోవాలి. అయితే ఇంట్లో ఒకరు వాడిన రుమాళ్లు, టవల్స్ మరొకరు వాడకపోవడం మంచిది.