తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రోల్‌ బంక్‌ కొలతల్లో తేడాలపై నామమాత్రపు చర్యలు

పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల్లో మోసాలకు పాల్పడుతున్న బంకు యజమానులపై చర్యలు నామమాత్రమవుతున్నాయి. పెట్రోల్‌ బంకుల్లో చిప్‌లు అమర్చి ఇంధనం తక్కువగా వచ్చేలా మోసాలకు పాల్పడితే కఠినచర్యలు ఉండవని తూనికలు కొలతల(తూ.కొ.)శాఖ కొత్త భాష్యం చెబుతోంది. అలాంటి మోసగాళ్లను న్యాయస్థానంలో ప్రాసిక్యూట్‌ చేసే అధికారం తమకు లేదని, జరిమానాలతో సరిపెట్టడం మినహా కేసు పెట్టలేమని చేతులెత్తేస్తోంది.

పెట్రోల్‌ బంక్‌ కొలతల్లో తేడాలపై నామమాత్రపు చర్యలు
పెట్రోల్‌ బంక్‌ కొలతల్లో తేడాలపై నామమాత్రపు చర్యలు

By

Published : Jan 22, 2021, 11:02 AM IST

మోసాలకు పాల్పడ్డ బంకులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎఫ్‌జీజీ) స.హ.చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఆ శాఖ అధికారులు ఇదే సమాధానం ఇచ్చారు.

మూసివేత తాత్కాలికం.. నిర్వహణ యథాతథం

హైదరాబాద్‌ నగరంలోని పలు పెట్రోల్‌ బంకుల్లో లీటరు పెట్రోలు పోయించుకుంటే 1000 మిల్లీలీటర్లకు బదులుగా 970 మి.లీ. వరకే వస్తోందని గతంలో పలుమార్లు పోలీసుల తనిఖీల్లో తేలింది. ముంబయిలాంటి నగరాల నుంచి తీసుకొచ్చిన చిప్‌లను పెట్రోల్‌ పోసే యంత్రాల్లో అమర్చడం ద్వారా నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడైంది. అలా మోసాలు బహిర్గతమైన సందర్భాల్లో తూ.కొ.శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించి పలు బంకుల్ని తాత్కాలికంగా మూసేశారు. కొద్దిరోజుల తర్వాత అవి తెరచుకుని యథావిధిగా కొనసాగుతున్నాయి.

తెలంగాణ ఏర్పడిన తర్వాత మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఇలాంటి మోసాలపై ఎన్ని కేసులు నమోదు చేశారు? ఏం చర్యలు తీసుకున్నారు? అన్న అంశాలపై ఎఫ్‌జీజీ స.హ.చట్టం కింద దరఖాస్తు చేసింది. ఇందుకు మేడ్చల్‌ జిల్లాలో 2018-19లో అయిదు కేసులు, 2019-20లో ఒక కేసు, ఈ రెండు సంవత్సరాల్లో కలిపి రంగారెడ్డి జిల్లాలో 28 కేసులు నమోదు చేసినట్లు తూ.కొ.శాఖ అధికారులు సమాధానమిచ్చారు. వీరిపై లీగల్‌ మెట్రాలజీ చట్టం-2009, సెక్షన్‌ 25 ప్రకారం జరిమానాలు మాత్రమే విధించినట్లు వెల్లడించారు. ఇలాంటి మోసాలపై ఒక్క కేసునూ న్యాయస్థానంలో ప్రాసిక్యూట్‌ చేయలేదని వివరణ ఇచ్చారు.

లీటర్ల ప్రస్తావనే లేదు

తూనికలు కొలతల శాఖ అధికారులు స.హ.చట్టం కింద కొలతల గురించి వివరణ ఇస్తూ ఈ తరహా మోసాలపై పోలీసులతో ఐపీసీ 418, 420 సెక్షన్లు కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తే బంకులను మూసివేయడంతోపాటు యజమానులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశముంటుంది. మోసాలకు పాల్పడే బంకుల్ని జప్తు చేయడంతోపాటు సంబంధీకులను న్యాయస్థానాల్లో ప్రాసిక్యూషన్‌ చేయాలి.-ఎం.పద్మనాభరెడ్డి, ఎఫ్‌జీజీ కార్యదర్శి

* మోసాలకు పాల్పడుతున్న పెట్రోలు బంకుల యజమానులపై ఐపీసీ 418, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి గురువారం తూనికలు, కొలతలశాఖ కంట్రోలర్‌కు లేఖ రాశారు.

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ఫిల్లింగ్‌ స్టేషన్లకు జరిమానాలు ఇలా..

* రూ.50 వేలు: శ్రీలక్ష్మి(బాచుపల్లి), రాజలక్ష్మి(శ్రీశైలం రోడ్‌), రాజేంద్రప్రసాద్‌(మొయినాబాద్‌), సాయిదత్తా

* రూ.35 వేలు: వైజయంతి సర్వీస్‌(తూంకుంట), టీఎస్‌ఆర్టీసీ(హకీంపేట), ఎంపైర్‌ సర్వీస్‌ స్టేషన్‌(చిలకానగర్‌), సాయి(యాచారం), గురునానక్‌(నాగోల్‌), కృష్ణ(తుర్కయాంజల్‌), శ్రీబాలాజీ కైలాష్‌(హస్తినాపూర్‌), ఫిల్మోర్‌ బీపీసీఎల్‌(అత్తాపూర్‌), దుర్గా(గున్‌గల్‌), లక్ష్మీనర్సింహా(కడ్తాల్‌)

* రూ.30 వేలు: శ్రీసాయిబాబా(ఇంజాపూర్‌)

* రూ.25 వేలు: జీఎంఆర్‌(మైలార్‌దేవ్‌పల్లి)

* రూ.20 వేలు: శ్రీధనలక్ష్మి(తుక్కుగూడ), ఫ్యుయెల్స్‌ ఫర్‌ ఎస్సార్‌(చేవెళ్ల), మిత్వాస వెంకటేశ్వర(నానక్‌రాంగూడ), శ్రీలక్ష్మి(షాద్‌నగర్‌), అర్ఫత్‌ (రాయికల్‌)

* రూ.10 వేలు: ఎస్‌బీరావు అండ్‌ సన్స్‌(నేరెడ్‌మెట్‌), గోపాల్‌గౌడ్‌(చెంగిచర్ల), సత్యసాయి(ఇంజాపూర్‌), బీఎన్‌(ఇబ్రహీంపట్నం), శ్రీగోపాల్‌ సర్వీస్‌స్టేషన్‌(శంషాబాద్‌), శ్రీశివప్రియ(పెద్దఅంబర్‌పేట), శ్రీసాయికృష్ణ(షాద్‌నగర్‌), ఎస్‌వీఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌(చటాన్‌పల్లి), రాజలక్ష్మి(కొంగరకలాన్‌), తోతాబాయి సోహన్‌లాల్‌(మొయినాబాద్‌), జైహనుమాన్‌(తుక్కుగూడ), సాయిబాలాజీ(షాద్‌నగర్‌)

* రూ.2 వేలు: సుమీత్‌(మొయినాబాద్‌)

ఇదీ చూడండి:ప్రమాదం ఆ ఇంట నింపింది పెను విషాదం

ABOUT THE AUTHOR

...view details