కృష్ణా నదీ జలాలు- తెలంగాణ ప్రభుత్వ విధానం అనే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, పాలమూరు అధ్యయన వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక సంయుక్త అధ్వర్యంలో వెబినార్ నిర్వహించారు. ఈ వెబినార్‌లో తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్‌తో పలువురు విశ్రాంత ఇంజినీర్లు పాల్గొన్నారు.
ఉద్యమ లక్ష్యాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం గుత్తేదార్ల ప్రయోజనాలు వారి ద్వారా తనకు జగన్‌కు నెరవేరే ప్రయోజనాలు తప్పితే ప్రజలను పట్టించుకోవడంలేదని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. కృష్ణా నది మీద పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రజాద్రోహానికి పాల్పడిందని మండిపడ్డారు.
811 టీఎంసీలలో మనకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే చాలని స్వయంగా ముఖ్యమంత్రి అనడం శోచనీయమన్నారు. మన న్యాయమైన వాటా మనకు దక్కాలని డిమాండ్ చేశారు. కృష్ణా బేసిన్లో రాయలసీమ వాడుకుంటున్న వాటా రెండో క్రాప్‌కు కూడా తీసుకుంటున్నారని.. 512 టీఎంసీలు ఆంధ్రాకు ఇచ్చి తెలంగాణకు 299 ఇవ్వడం తప్పని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.