రాష్ట్రంలో చేనేత కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని నేతన్నల ఐక్య కార్యచరణ కమిటీ కోరింది. గత్యంతరం లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను చిన్న చూపు చూస్తోందని నేతన్నల ఐక్య కార్యచరణ కమిటీ ఛైర్మన్ డా.సురేష్ వాపోయారు. 2018 ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ పద్మశాలీల్లో ఒకడిగా ఉంటానని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 18 నెలలు గడుస్తున్నా మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం విచారకరమని హైదరాబాద్ విద్యానగర్‌లోని కమిటీ కార్యాలయంలో పేర్కొన్నారు.
మీ వాడినే అన్నాడు.. జాడ లేకుండా పోయాడు : నేత కార్మికుల జేఏసీ ఆ హామీ నేరవేరక 35 మంది బలి
రైతులకు ఇచ్చే 5లక్షల బీమా మాదిరిగానే తమకూ వేతనాలను అందజేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారని వాపోయారు. హామీ అనంతరం 35 మంది చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు తాలలేక బలవన్మరణాలకు పాల్పడ్డారని అన్నారు. త్వరలోనే నేతన్నల సమస్యలపై హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పవర్‌లూమ్‌కు ఇస్తున్న ప్రాధాన్యత తమకివ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చేనేత కార్మికుల పేరిట మోసాలకు పాల్పడే సంస్థలపై చర్యలు తీసుకోవాలన్న కేంద్ర ఆదేశాలను రాష్ట్ర సర్కార్ బేకాతరు చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. నేతన్నలకు ఇప్పటివరకు ఏ మేరకు ఆర్థిక సాయం అందజేశారనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది.
ఇవీ చూడండి : న్యాయం చేయాలని కోరుతూ జీఎం కార్యాలయం ముట్టడి