తెలంగాణ

telangana

ETV Bharat / state

సత్వరమే ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిర్వహిస్తాం: జనార్దన్​రెడ్డి - TSPSC New Chairman janardan reddy talk with eenadu

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్​ కమిషన్‌ ద్వారా సత్వరమే ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిర్వహిస్తామని కమిషన్‌ నూతన ఛైర్మన్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బూసిరెడ్డి జనార్దన్‌రెడ్డి తెలిపారు. సంస్థ పరంగా ఏమాత్రం ఆలస్యానికి, అలసత్వానికి ఆస్కారమివ్వబోమన్నారు. ‘అత్యంత వేగంగా.. ఎప్పటి పనులు అప్పుడే‘ అనే నినాదంతో, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. ఎంపిక పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగాలు పొందినవారైనా, నిరుద్యోగులైనా అందరూ సంతృప్తి చెందేలా పనిచేస్తామన్నారు. దేశంలోనే ఆదర్శ కమిషన్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. కొత్త ఛైర్మన్‌గా నియమితులైన అనంతరం ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

వేగంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం
వేగంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం

By

Published : May 20, 2021, 8:57 AM IST

ఐఏఎస్‌ అధికారిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. ఈ ఛైర్మన్‌ పదవినిఎలా భావిస్తున్నారు?

ఉద్యోగ నిర్వహణలో ఏ బాధ్యతనైనా చేయాల్సిందే. ఏ హోదా పెద్దది.. ఏది చిన్నది అని చూసుకోకూడదు. తెలంగాణ ఆవిర్భవించిన కొత్తలో ఒకేసారి పలు శాఖలతో పాటు విశ్వవిద్యాలయ వీసీగా తొమ్మిది బాధ్యతలు నిర్వహించా. పనిలోనే నాకు ఆనందం ఉంది. ప్రతి దస్త్రాన్ని రెండు నిమిషాల్లోనే పరిష్కరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. కలెక్టర్‌గా ఉన్నప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు ముగించుకొచ్చి రాత్రి రెండు గంటల వరకు దస్త్రాలను చూసిన రోజులున్నాయి. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా వచ్చిన అవకాశం కీలకమైంది. దీనికి పూర్తి న్యాయం చేస్తా.

25 లక్షల మందికి పైగా నిరుద్యోగులున్నారు. వారికి కమిషన్‌పై ఎన్నో ఆశలున్నాయి?

25 లక్షల మందికి ఉద్యోగాలివ్వడం కష్టసాధ్యం. ఇచ్చేవి కొన్ని అయినా ప్రతి నిరుద్యోగి దృష్టి దానిపైనే ఉంటుంది. ప్రక్రియ ఎలా జరుగుతోంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. అత్యంత ప్రతిభావంతులకే ఉద్యోగాలొస్తాయి. వారు 25 - 30 ఏళ్ల పాటు సర్వీసులో ఉంటారు. ఎంపిక ప్రక్రియ నిజాయితీతో ఉంటే వారు కూడా నిజాయితీపరులుగా ఉండి, ప్రజలకు సేవలందిస్తారు. ఎంపిక సమయంలో ఏ మాత్రం అవినీతికి ఆస్కారం ఉన్నా...ఆ ప్రభావం వారి ఉద్యోగ నిర్వహణపై పడుతుంది. వారి పనితీరూ అలానే ఉంటుంది. అలాంటి పరిస్థితిని రానీయబోం.

నియామకాల్లో తీవ్ర జాప్యానికి కారణాలు?

ప్రభుత్వ ఉద్యోగం ఎన్నో అంశాలతో ముడిపడి ఉంది. ఖాళీల గుర్తింపు, రిజర్వేషన్లు, రోస్టర్‌ ఖరారు, విద్యార్హతలు, సేవా నిబంధనలు..ఇలా పలు అంశాలను చూసిన తర్వాతే నియామకాలు చేపట్టాలి. నిబంధనల మేరకు పోస్టుల నోటిఫికేషన్‌, దరఖాస్తులు, రాత,మౌఖిక పరీక్షలు జరగాలి. దీనికి తగిన గడువు ఇవ్వాలి. వీటన్నింటికి తోడు న్యాయపరమైన వివాదాలుంటాయి. ఇవి పరిష్కారమైతేనే ఉద్యోగం లభిస్తుంది. కమిషన్‌ తరఫున వీలైనంత త్వరగా నియామకాలు జరగాలని భావిస్తున్నా. జాప్యం ఒక సమస్యగా భావిస్తా. దాని వల్ల అపోహలు, అనుమానాలుంటాయనేది నా భావన. వేగంగా పనిచేయడం వల్ల నాకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కేంద్రం నుంచి సునామీ కన్వర్జెన్స్‌ పురస్కారం లభించింది. అదే ఒరవడిని ఇక్కడా చూపిస్తా.

దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

ప్రభుత్వం, అన్ని శాఖలు, అధికారులను సమన్వయం చేసుకుంటా. నిరుద్యోగుల సహకారాన్ని కోరతా. న్యాయపరమైన వివాదాలు లేకుండా ప్రయత్నిస్తా. న్యాయస్థానాల సహకారం సైతం కోరతాం. లోటుపాట్లు, పొరపాట్లను పరిహరించేందుకు ప్రయత్నిస్తాం.

యూపీఎస్సీ మాదిరిగా ఉద్యోగ నియామకాల క్యాలెండర్‌ను నిర్వహిస్తారా?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. నెలనెలా క్యాలెండర్‌ ఉంటే నిరుద్యోగులు నిత్యం కొలువుల అన్వేషణలో ఉంటారు. ఒకసారి చదివింది అన్ని పరీక్షలకు ఉపయోగపడుతుంది. దీనిపై ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా పనిచేస్తాం.

ఇదీ చూడండి: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకం

ABOUT THE AUTHOR

...view details