నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఖండించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతుల పోరాటానికి కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన వెల్లడించారు.
రోహింగ్యాలు ఉంటే కేంద్రానిదే బాధ్యత:
హైదరాబాద్లో రోహింగ్యాలు ఉంటే అసద్ లేఖ రాయమని అమిత్ షా చెప్పడం దేనికి సంకేతం. మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటారు. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనైతికమని పొన్నం విమర్శించారు.
ధాన్యం కొనుగోలులో జాప్యమెందుకు?
సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా సన్నవరి సాగుచేసిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని పొన్నం మండిపడ్డారు. సన్నాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రతిగింజను కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం ఏం చేస్తోందని విమర్శించారు. రాజకీయ నేతలపై దాడులు చేస్తున్న కేంద్రప్రభుత్వ సంస్థలు కేసీఆర్పై ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.