జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారును షెడ్డుకు పంపిస్తే, సారు.. కారు.. సర్కారు.. ఇక రారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఏం జరగబోతుందో దేశం మొత్తం చూస్తోందన్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దుబ్బాకలో భాజపాను ప్రజలు గెలిపించారన్నారు.
భాగ్యనగరాన్ని మజ్లిస్ చేతిలో పెడితే..
గ్రేటర్ మేయర్ పీఠాన్ని ఎంఐఎంకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరాన్ని మజ్లిస్ చేతిలో పెడితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో గ్రేటర్ ప్రజలు ఆలోచించాలని సంజయ్ కోరారు. తెలంగాణ కోసం ఎంఐఎం ఏనాడూ పోరాడలేదని సంజయ్ అన్నారు. ఎన్నికల సంఘం సైతం అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని సంజయ్ ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు గెలిచి.. జీహెచ్ఎంసీపై కాషాయ జెండా ఎగరేసేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నట్లు సంజయ్ తెలిపారు. దుబ్బాక ఫలితాలు జీహెచ్ఎంసీలోనూ పునరావృతమవుతాయని బండి సంజయ్ స్పష్టం చేశారు.