తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరాన్ని ఇంకా వదలని వరదనీరు - floods in hyderabad

నెల రోజులైనా నగరాన్ని వరద నీరు వదలడం లేదు. ఇంకా పలు కాలనీలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. శివారులోని బాహ్యవలయ రహదారి కూడా వరద ప్రవాహంలో చిక్కుకుపోయింది. ఆ వరద నీటిని తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

water stagnant at pedda golconda orr junction in hyderabad
నగరాన్ని ఇంకా వదలని వరదనీరు

By

Published : Nov 10, 2020, 10:59 PM IST

నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు కురిసి నెలరోజులు కావస్తున్నా.. ఇంకా వరద నీరు నగరాన్ని వదలడం లేదు. లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు జలదిగ్భందంలోనే ఉండగా.. నగర శివారులోని బాహ్యవలయ రహదారి కూడా వరద ప్రవాహంలో చిక్కుకుపోయింది. వాహనాల అండర్​పాస్ వంతెనలు, ఇంటర్​ఛేంజ్ రహదారులు, టోల్ వసూలు కేంద్రాలు చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. చిన్నగోల్కొండ చెరువు పరిధిలో నిర్మించిన పెద్ద గోల్కొండ ఔటర్ జంక్షన్ కేంద్రం గత నాలుగు వారాలుగా నీట మునిగే ఉంది. ఆ జంక్షన్ వద్ద వరద నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడం వల్ల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. టోల్ వసూలు సాంకేతిక వ్యవస్థ, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నీటమునిగి లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు.

కొత్వాల్ గూడ, రాళ్లగూడ, హమీదుల్లానగర్, చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండ ప్రాంతాల వైపు వేగంగా దూసుకొస్తున్న వాహనదారులకు రాత్రి సమయంలో ప్రమాదం పొంచి ఉంది. అయితే ఆ వరద నీటిని బయటకు పంపించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రహదారిపై నిలిచిన వరద నీటిని మోటార్ల ద్వారా వాటర్ ట్యాంకర్లలో నింపి పంపిస్తున్నారు. ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి బాహ్య వలయ రహదారి నిర్వహణ, మరమ్మతులను పునరుద్దరించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి: పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఖరారుకు షెడ్యూల్

ABOUT THE AUTHOR

...view details