శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నందున అధికారులు జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 4.65 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు అధికారులు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మొదట... జలాశయం గేటును 10 అడుగుల మేర పైకెత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఒక గేటు ద్వారా 20 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. అనంతరం మరో గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. క్రమంగా రాత్రికి పదిగేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు తెలిసింది.
శ్రీశైలం గేట్లు ఎత్తనున్న సమాచారం తెలుసుకున్న పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు. శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు డ్యామ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలంలో జలకళతో పాటు సందర్శకుల తాకిడి పెరిగింది.