తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి ఉప్పొంగింది... కృష్ణమ్మ ఉరకలెత్తింది - godavari and krishna rivers news

రాష్ట్రంలో ప్రాజెక్టులు... జల సంపదతో కళకళలాడుతున్నాయి. దిగువన కృష్ణమ్మ... ఎగువన గోదారమ్మ ఒకేసారి పరవళ్లు తొక్కుతున్నాయి. గోదావరికి కొంత ఉద్ధృతి తగ్గినా... ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో... కృష్ణమ్మ ఉరకవెత్తుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక భద్రాచలం వద్ద... సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

water project filled in telangana
గోదావరి ఉప్పొంగింది... కృష్ణమ్మ ఉరకలెత్తింది

By

Published : Aug 20, 2020, 6:03 AM IST

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువవుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో జూరాల జలాశయం నీటితో... తొణికిసలాడుతోంది. ప్రస్తుతం జలాశయానికి 3లక్షల 17 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. గేట్లు ఎత్తి 3లక్షల 16 వేల 258 క్యూసెక్కుల నీటని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలతో పాటు తుంగభద్ర నుంచి పోటెత్తుతున్న వరదతో... ఈ సీజన్​లో తొలిసారి శ్రీశైలం గేట్లు తెరుచుకున్నాయి. జలాశయానికి 3లక్షల 48వేల 125 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తితో పాటు గేట్లు ఎత్తి లక్షా 50వేల 452 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 881.30కు చేరుకుంది. గరిష్ఠ నీటి నిల్వ 215.81 టీఎంసీలుగా ఉంటే... ఇప్పటికే 195.21 టీఎంసీలకు చేరుకుంది.

శ్రీశైలం నుంచి పోటెత్తుతున్న నీటితో... నాగార్జునసాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 571.60 అడుగులకు చేరుకుంది. జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 260.59 టీఎంసీలకు చేరుకుంది. సాగర్​కు లక్షా 50వేల 452క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చిచేరుతుండగా.. 17వేల 658క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

గోదావరి సైతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎస్సారెస్పీ జలకళను సంతరించుకుంది. 3 రోజుల్లోనే 15 టీఎంసీలకు పైగా చేరింది. ఇక కాళేశ్వరం బ్యారేజీలు ఇప్పటికే నిండుకుండలా మారడంతో దిగువకు గోదారమ్మ పరుగులు పెడుతోంది. భద్రాచలం వద్ద పరివాహక ప్రాంత ప్రజలను బెంబేలెత్తించిన గోదారమ్మ క్రమంగా శాంతించింది. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఎత్తేయడంతో... అధికారులు, ఏజెన్సీ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:'అక్కడే తేల్చుకుందాం... అపెక్స్ కౌన్సిల్​ సమావేశానికి సిద్ధంకండి​'

ABOUT THE AUTHOR

...view details