హైదరాబాద్ శివార్లలో అరకొర నీరు.. వేసవిలో పరిస్థితి జటిలం! - తెలంగాణ వార్తలు
Hyderabad Water Problems : హైదరాబాద్ నగరంలో మంచినీరు జలజల పారుతోంది. కానీ శివార్లలో అరకొరగానే వస్తున్నాయి. పురపాలికల్లో మూడు, నాలుగు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా వేసవిలో ఈ సమస్య ఇంకా జటిలమయ్యే అవకాశం ఉంది. నీటి కొరత తీర్చాలని ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా... అక్కడక్కడా ఈ తిప్పలు తప్పడం లేదు.
హైదరాబాద్ శివార్లలో నీరు అరకొర
By
Published : Feb 27, 2022, 10:55 AM IST
Hyderabad Water Problems : గ్రేటర్‌లో తాగునీరు పుష్కలంగా సరఫరా అవుతుండగా.. శివారు కాలనీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేసవిలో పరిస్థితి జటిలం అవుతోంది. కొత్తగా వెలుస్తున్న కాలనీల ప్రజలు అధికంగా సతమతమవుతున్నారు. కొన్నేళ్లుగా నగరం శివార్లలో బాగా విస్తరించింది. వందలాది కాలనీలు వెలిశాయి. లక్షలాది మంది జనాభా నివసిస్తున్నారు. అక్కడ తాగునీటి వ్యవస్థ సరిగా లేక నేటికీ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా.. పనుల్లో జాప్యం, పాత పైపులైను వ్యవస్థ, లీకేజీల వల్ల సమస్య తీరడంలేదు.
నాలుగు రోజులకోసారి..
నాగారం, దమ్మాయిగూడ పురపాలికల్లో నాలుగు రోజులకో సారి నీరు సరఫరాఅవుతోంది. పైపులైన్ల వ్యవస్థలో లోపాల వల్ల సరిపడా సరఫరా కావడంలేదు. ఇక్కడ 36 వేల ఇళ్లు, 30,570 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ట్యాంకరు నీటిని రూ.700 చొప్పున కొంటున్నారు.
రైలు పట్టాలు అడ్డు
పోచారం మున్సిపాలిటీలోని 1, 2, 3 వార్డుల్లో రూ.15-20 చెల్లించి నీటి క్యాన్లు కొంటున్నారు. రిజర్వాయర్లు నిర్మించి, అంతటా పైపులైన్లు వేసినా, యంనంపేట వద్ద రైలు పట్టాలున్నంత మేర వేయలేదు. ఇందుకు రూ.కోటి ఖర్చు కానుండడంతో మున్సిపాలిటీకి ఆ నిధులు భారమయ్యాయి.
రూ.1200 కోట్లతో పనులు
శివారు మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఓఆర్‌ఆర్ ఫేజ్-2 కింద రూ.1200 కోట్లతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పూర్తి కావడానికి ఏడాది పట్టే అవకాశం ఉన్నందున ఈ వేసవిలోనూ తిప్పలు తప్పని పరిస్థితి. జీహెచ్‌ఎంసీలో కనెక్షన్‌కు రోజుకు 20 వేల లీటర్ల తాగునీరు ఇస్తున్నట్లే తమకూ ఇవ్వాలని శివారు పురపాలికల వాసులు కోరుతున్నారు.
ఇళ్లకు తక్కువ.. వృథా ఎక్కువ
వేధిస్తున్న సమస్య
జల్‌పల్లి ప్రాంతాన్ని నాలుగు దశాబ్దాలుగా నీటి సమస్య వేధిస్తోంది. రూ.200 కోట్లతో ప్రాజెక్టు చేపట్టినా సమస్య తీరలేదు. 7 ఎంఎల్‌డీలకు గాను 3 ఎంఎల్‌డీ నీరే సరఫరా అవుతోంది. వార్డులు 11, 12, 17, 18, 19, 20, 21, 22, 28 తదితర ప్రాంతాల్లో పురాతన పైపులైన్ల వ్యవస్థ అధ్వానంగా ఉంది. రోజుకు 15-20 వేల లీటర్లు వృథా అవుతున్నాయి.
నాలుగు కాలనీలకు ట్యాంకర్లే గతి
నిజాంపేట కార్పొరేషన్‌లో నాలుగు కాలనీలు ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నాయి. బాచుపల్లి పరిధి లక్ష్మీనగర్‌కాలనీ, సాయినగర్, రాజీవ్‌గాంధీనగర్, నిజాంపేట ఇందిరమ్మ ఫేజ్-3 కాలనీలో పైపుల వేయక సమస్య ఉత్పన్నమైంది.
అన్నింటా అదే కథ
తూంకుంట మున్సిపాలిటీలో బిట్స్ కాలనీ, దేవరయాంజాలలోని రెండు కాలనీలకు ట్యాంకర్లే దిక్కవుతున్నాయి.
తుర్కయంజాల్ పురపాలికకు రూ.92 కోట్లు మంజూరవగా.. 218 కి.మీ. మేర పైపులైన్లు వేయాల్సి ఉంది.
ఆదిభట్ల కొంగరకలాన్‌లో మూడు రోజులకోసారి తాగునీటిని వదులుతున్నారు. రాందాస్‌పల్లిలో బోరు నీటిని, తాగునీటిని కలిపి వదలడం వల్ల వాడుకకు మాత్రమే పనికొస్తోంది.
బడంగ్‌పేట కార్పొరేషన్‌లో మూణ్నాలుగు రోజులకోసారి తక్కువ ఒత్తిడితో నీరు ఇస్తున్నారు. మరో 7 ట్యాంకులు నిర్మించాల్సి ఉంది.
కొత్తూరు రోడ్డు విస్తరణ వల్ల నెల రోజులుగా మంచినీరు రావడంలేదు. నందిగామ శివారులో పైపులైన్లు ధ్వంసమయ్యాయి. బోరు నీరే దిక్కవుతోంది.
మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలో పాత పైపులైన్లున్నాయి. మూడు రోజులకోసారి తక్కువ ఒత్తిడితో తాగునీరు ఇస్తున్నారు.
కొనుగోలు చేయక తప్పని పరిస్థితి
ట్యాంకర్లతో సరఫరా
దుండిగల్ పురపాలికలోని బహదూర్‌పల్లి, బౌరంపేట జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహసముదాయాలు, డి.పోచంపల్లి పరిధిలోని 12 కాలనీలు/ప్రాంతాలకు, గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని సర్వేనం.168, బౌరంపేట, మల్లంపేట ప్రాంతాల్లో పైప్‌లైన్ వేయకపోవడంతో నీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. పురపాలిక.. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్లతో సరఫరా చేస్తోంది.