కృష్ణా జలవివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రాజెక్టులన్నీ పోలీసు పహారాలోకి వెళ్లాయి. జూరాల మొదలుకొని పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. నాగార్జునసాగర్ వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కోరేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ అధికారులను తెలంగాణ పోలీసులు అనుమతించలేదు. పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ ఆ ప్రాజెక్టు ఎస్.ఇ తెలంగాణ జెన్‌కో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. జూరాల డ్యాంపైకి తెలంగాణ రాకపోకలు నిలిపివేయగా, ఆర్డీఎస్ కుడికాలువ వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసు బలగాలను మోహరించింది. ఈ పనులను నిలిపివేయాలని తెలంగాణ కోరింది. శ్రీశైలం వద్ద రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించగా, పోతిరెడ్డిపాడు వద్ద పోలీసులను పెంచి ఆంధ్రప్రదేశ్ ఎవరినీ అనుమతించడం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఆయా జిల్లాల ఎస్పీలు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జూరాల నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని తెలంగాణ గట్టిగా కోరుతోంది. అయితే 841 అడుగుల దిగువన ఉన్నప్పుడు నీటిని తీసుకోవడానికి అవకాశం లేదంటూ రాయలసీమ ప్రాజెక్టును కొనసాగించడానికి ఏపీ ప్రయత్నిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో కృష్ణాపై కొత్త బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టడంతోపాటు పూర్తి స్థాయిలో జల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని నిర్ణయించి అమలు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలు పరస్పరం బోర్డుకు ఫిర్యాదులు చేసుకొంటూనే ఇంకోవైపు విద్యుదుత్పత్తి, ఆయకట్టుకు నీటివిడుదల, నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. వీటికి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జూరాల డ్యాంపై రాకపోకల నిషేధం..
జూరాలలో పూర్తి స్థాయి నీటినిల్వ 9.66 టీఎంసీలు కాగా, 7.86 టీఎంసీలు ఉన్నాయి. 21,877 క్యూసెక్కుల నీరొస్తుండగా, 20,986 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. గురువారం మధ్యాహ్నానికి జూరాలలోకి ప్రవాహం తగ్గింది. జూరాల డ్యాంపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. ప్రభుత్వ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో మక్తల్, నారాయణపేట, ఆత్మకూరు తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి ఇబ్బంది ఏర్పడింది. డ్యాం వద్ద, జలవిద్యుత్తు కేంద్రం వద్ద ప్రత్యేక పోలీసులను నియమించారు.
శ్రీశైలం వద్ద రెండు రాష్ట్రాల భద్రత..
శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 43.55 టీఎంసీలు ఉన్నాయి. కనీస నీటిమట్టం 834 అడుగులు కాగా, 823.40 అడుగుల మట్టం ఉంది. జూరాలలో విద్యుదుత్పత్తి, స్థానికంగా కురిసే వర్షాలతో కలిపి బుధవారం ఉదయం ఆరుగంటల నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 30,610 క్యూసెక్కులు శ్రీశైలంలోకి రాగా, ఈ మొత్తం నీటిని బయటకు వదిలారు. విద్యుదుత్పత్తితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కుల నీటిని వదిలారు. అయితే గురువారం మధ్యాహ్నం మూడుగంటలకు జూరాల నుంచి 6,282 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 4446 క్యూసెక్కులు రాగా, శ్రీశైలం డ్యాం వద్ద 21 వేల క్యూసెక్కులు నమోదైంది. అయితే బయటకు మాత్రం 28,252 క్యూసెక్కుల నీటిని వదలడంతో శ్రీశైలంలో నీటిమట్టం కొంత తగ్గింది. జూరాల నుంచి విడుదల తగ్గడంతో శ్రీశైలంలోకి ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణ 12.928 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసింది. మరోవైపు డ్యాం వద్ద రెండు రాష్ట్రాలు పోలీసుభద్రత పెంచాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసుభద్రతను పెంచినట్లు తెలిసింది.