Sri Ram Sagar Project Capacity : రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాజెక్టులోకి ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 26వేల 296 క్యూసెక్కులుగా ఇన్‌ఫ్లో వస్తోంది. 1091 అడుగుల గరిష్ట స్థాయికి గాను 1083.30 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 90 టీఎంసీలకు ప్రస్తుతం 61.766 నిల్వ ఉంది.
Nizam Sagar Project Water Depth Today: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 5వేల 500 క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.18 టీఎంసీలు నీరు ఉంది. జుక్కల్ మండలం కౌలాస్ నాల ప్రాజెక్టులోకి 243 క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.630 టిఎంసీలు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ 8వేల 507 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 800 క్యూసెక్కుల నీటిని ఒక వరద గేట్ ద్వారా దిగువకు వదులుతున్నారు.
Irrigation Projects Details in Telangana: ప్రాణహిత ప్రవాహంతో కాళేశ్వరం బ్యారేజీల్లోకి వరద పోటెత్తుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ఇంద్రావతి సహా ఇతర ఉపనదులు ప్రవాహం తోడై.. భద్రాచలం వద్ద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 42.8 అడుగుల ప్రవాహం ఉండటంతో.. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ఖమ్మం సమీపంలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తొంది. ప్రకాశ్‌నగర్ చెక్‌డ్యాం వద్ద మున్నేరు ప్రవాహాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరిశీలించారు. ఉద్ధృతి పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.