Good Water Celebrations in Decade Celebrations : దశాబ్ది ఉత్సావాల్లోభాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మంచి నీళ్ల వేడుకులను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం అధికార యాంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో 'మిషన్ భగీరథ'తో వచ్చిన మార్పులను ఓసారి గమనిస్తే.. స్వరాష్ట్రంలో తాగునీటి కష్టాలు తీరాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛ జలాలు వచ్చాయి. నీళ్ల ట్యాంకర్ల వద్ద బిందెడు నీటి కోసం ఆడబిడ్డల సిగపట్లు.. కిలోమీటర్ల దూరం నడిచి వాగులు, వంకల్లో చెలిమలు తవ్వుకొని నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు. వ్యవసాయ బావుల వద్ద నీటి కోసం భగీరథ యత్నాలు.. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు పడిన 'కన్నీటి' కష్టాలు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి కష్టాలు తొలగించేందుకు కంకణం కట్టుకొన్నారు. భవిష్యత్తు తరాలకు నీటి సమస్యలు రాకూడదని పక్కా ప్రణాళికలు రచించారు. మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు.
Decade Celebrations In Telangana :పక్కా ప్రణాళికతో ప్రస్తుతం ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా జరుగుతున్నది. నీటి వెతలు తీర్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ మహిళాలోకం కృతజ్ఞతలు తెలుపుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, శుద్ధి చేసిన నీటిని పంపిణీ చేయాలన్న కేసీఆర్ స్వప్నం సాకారమైంది. తెలంగాణలోని 23,839 గ్రామీణ ఆవాసాల్లోని 57.01 లక్షల ఇండ్లు, మున్సిపాలిటీలోల విలీనమైన మరో 649 గ్రామీణ ఆవాసాలు, 121 మున్సిపాలిటీలకు, అడవులు, కొండలపైన ఉన్న 136 గ్రామీణ ఆవాసాలకు మిషన్ భగీరథ స్వచ్ఛ జలాలు సరఫరా అవుతున్నాయి.
Water day In Telangana :మిషన్ భగీరథ నీటితో నల్లగొండ జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ రక్కసిని తరిమేశారు. ఈ పథకం అమలుకోసం వివిధ ప్రాజెక్టుల నుంచి 59.94 టీఎంసీల నీటిని కేటాయించారు. కృష్ణా బేసిన్ నుంచి 23.44 టీఎంసీలు, ఎల్లంపల్లి హెచ్ఎండబ్ల్యూఎస్ఎల్బీ లైన్ నుంచి 3.92 టీఎంసీలు, గోదావరి బేసిన్ నుంచి 32.58 టీఎంసీల నీటినిమిషన్ భగీరథ పథకానికి కేటాయించారు. ప్రజలకు 100 శాతం సురక్షిత తాగునీటిని అందజేస్తున్న అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే తొలిస్థానంలో నిలవడం విశేషం.మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రజలందరికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నదని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. 2019లో మిషన్ భగీరథ పథకానికి నేషనల్ వాటర్ కమిషన్ అవార్డు కింద ప్రథమ బహుమతి లభించింది.