Water Bodies in Telangana Encroached : తెలంగాణలోనే అధికంగా నీటి వనరుల ఆక్రమణలు.. జల్‌శక్తి మంత్రిత్వశాఖ గణనలో వెల్లడి - Ministry of Jal Shakti report water bodies IN TS
Water Bodies in Telangana Encroached : ఆక్రమణలకు కాదేది అనర్హం అన్నట్లు తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. కేవలం పట్టణాలు, నగరాల్లో మాత్రమే చెరువులు, కుంటలు, నీటి వనరులు కబ్జా జరుగుతుండగా చూశాం. కానీ కేంద్రం ఇటీవల నిర్వహించిన లెక్కల్లో గ్రామీణ ప్రాంతాలు కూడా జతకలిశాయి. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లోని జలవనరుల్లో కూడా అధికంగా ఆక్రమణలకు గురవుతుందని మినిస్ట్రీ ఆఫ్ జల్‌శక్తి నిర్వహించిన లెక్కల్లో తేలింది. 2017-19 ఏడాది నుంచి మినిస్ట్రీ ఆఫ్ జల్‌శక్తి నిర్వహించిన గణనలో గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరుల్లో ఆక్రమణలు రాష్ట్రంలో అధికంగా జరిగినట్లు వెల్లడైంది.
Jal Shakti Census Report on Encroached Water Bodies in Telangana :తెలంగాణలో ఆక్రమణలు అంతా ఇంతా కాదు.. నగరాల్లో, పట్టణాల్లో ఆక్రమణలతో ఎన్నో బాధలు. దీంతో వర్షాకాలంలో అయితే పరిస్థితులు మరింత దారుణం.. ఇళ్లల్లోకి నీళ్లు రావడం.. రోడ్లపై ప్రయాణించలేనంతగా నీరు పొంగిపొర్లడం ఇలాంటి పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంది. హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల ఇలా పలు నగరాల నుంచి మొదలు పెడితే.. చిన్న పట్టణాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. చెరువులు, కుంటలు, నీటి వనరుల (Water Bodies in Telangana) బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతుండటం ఎక్కువగా మారి జనజీవనానికి ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ బాధలు, ఆక్రమణలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా విస్తరించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరుల వద్ద ఆక్రమణలు పెరిగి అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయి. వెరసి ఇటూ ఇండ్లలోకి నీరు రావడం.. మరోవైపు పంట పొలాలు కూడా మునిగిపోతున్నాయి. చెరువులు కట్టలు తెగి ఆరుగాలం శ్రమించిన అన్నదాత పంటలు నీటమునుగుతున్నాయి. దాంతో ఎన్నో రోజులుగా చేసిన కష్టమంతా బుగ్గిపాలవుతోంది.
Ministry of Jal Shakti Report Water Bodies Encroached in Telangana :తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 2,920.. పట్టణ ప్రాంతాల్లో 112.. మొత్తం 3,032 నీటి వనరులు ఆక్రమణకు గురయ్యాయని మినిస్ట్రీ ఆఫ్ జల్‌శక్తి (Ministry of Jal Shakti) నిర్వహించిన లెక్కల్లో కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో 27,003చెరువులు, 16,292 ట్యాంకులు, 289 సరస్సులు.. 111 రిజర్వాయర్లు, 19,239 చెక్‌డ్యాంలు, ఇతర వాటర్ బాడీస్ 1,121.. మొత్తం నీటి వనరులు 64,055 ఉన్నాయి. అందులో అధికశాతం గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరులు ఆక్రమణలకు (Water Bodies Encroached in Telangana) గురవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తన లెక్కల్లో వెల్లడించింది.
తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో రంగారెడ్డిలో 53, హైదరాబాద్‌లో 59 మొత్తం 112 నీటి వనరులలో.. 86 నీటి వనరుల ఆక్రమణలు అంచనా దశకు మించి ఉన్నాయని.. అంటే అంచనా వేయడానికి ఏమీ లేదని తేలింది. అధ్యయనం చేపట్టిన సిబ్బంది సంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని.. మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని గణనీయమైన విస్తీర్ణంలో.. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన నీటి వనరుల గురించిన పరిశోధనలను చేశారు.
నీటి వనరులు ఎక్కువగా ఆక్రమణకు గురైన జిల్లాలు..
జిల్లా పేరు
గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరులు
పట్టణ ప్రాంతాల్లోని నీటి వనరులు
మొత్తం
సూర్యాపేట జిల్లా
686
9
695
మెదక్ జిల్లా
339
-
339
జోగులాంబ గద్వాల జిల్లా
222
2
224
సిద్దిపేట జిల్లా
219
1
220
నల్గొండ జిల్లా
153
-
153
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
149
-
149
జనగాం జిల్లా
149
-
149
మహబూబ్‌నగర్ జిల్లా
147
1
148
కరీంనగర్ జిల్లా
145
-
145
కామారెడ్డి జిల్లా
106
-
106
నీటి వనరులు తక్కువగా ఆక్రమణకు గురైన జిల్లాలు..
జిల్లా పేరు
మొత్తం నీటి వనరుల సంఖ్య
ఆక్రమణకు గురైన నీటి వనరులు
నిర్మల్ జిల్లా
1,016
2
మంచిర్యాల జిల్లా
1,773
6
మహబూబ్‌నగర్ జిల్లా
2,885
4
రాజన్న సిరిసిల్ల జిల్లా
842
4
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
1,873
7
ఖమ్మం జిల్లా
1,683
8
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా
553
8
వికారాబాద్ జిల్లా
1,358
9
హనుమకొండ జిల్లా
777
13
తెలంగాణలోని జిల్లాలను పరిగణనలోకి తీసుకుని చేపట్టిన జనాభా గణనలో.. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 12,323 నీటి వనరులు వినియోగంలో లేవని వెల్లడైంది.నీటి వనరుల ఆక్రమణలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇదీ ఇలా కొనసాగితే మరింత ఇబ్బందయ్యే అవకాశం ఉందని వారు వాపోతున్నారు.