ఖైరతాబాద్ జలమండలి ఉన్నతాధికారులతో ఎండీ దానకిషోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో మంచి నీటిని ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరఫరా చేయాలని ఎండీ అదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని అదేశించారు. ఎక్కువ లోతు ఉన్న మ్యాన్‌హోళ్లపై మూతలు, సేఫ్టీ గ్రిల్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని.. తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియను చేపడుతున్నామని.. ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. బస్తీల్లో, వరద ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటున్నామని.. ఇళ్లలో నిల్వ చేసిన నీటిని శుద్ధి చేసుకోవడం కోసం ప్రజలకు క్లోరిన్ బిళ్లలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.