మహానగరం పరిధిలో నిత్యం 1900 ఎంఎల్‌డీ మురుగునీరు ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో కేవలం 772 ఎంఎల్‌డీ మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగతాదంతా చెరువులు, కుంటలు, నాలాల్లో కలుస్తోంది. కూకట్‌పల్లి నాలాలో అతి ప్రమాదకరమైన పరిశ్రమల వ్యర్థాలు కలుస్తున్నాయి. హుస్సేన్‌సాగర్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం అంబర్‌పేట, అత్తాపూర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో మురుగునీరు కూడా పెరుగుతోంది. శుద్ధి చేయకపోవడంతో భవిష్యత్తులో అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు, జలవనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మురుగుశుద్ధిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా జలమండలి ఎండీ దానకిషోర్ దీనిపై సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. మూడు దశల్లో శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మొదటి దశలో అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్ ప్రాంతాల్లో 8 మురుగుశుద్ధి కేంద్రాలను రూ.1230 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసి 402.50 ఎంఎల్‌డీ మురుగును శుద్ధి చేయాలన్నది లక్ష్యం. రెండోదశలో రాజేంద్రనగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో రూ.1355.13 కోట్ల వ్యయంతో 6 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 480.5 ఎంఎల్‌డీ మురుగును శుద్ధి చేస్తారు. మూడోదశలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేర్‌లింగంపల్లి ప్రాంతాల్లో 17 శుద్ధి కేంద్రాలను రూ.1280.87 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ 376.50 ఎంఎల్‌డీల మురుగునీటిని శుద్ధి చేయాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు సర్కార్ నిధులు సైతం మంజూరు చేసింది. ఇప్పటికే కొన్నిచోట్ల పనులు మొదలయ్యాయి.
కంపు కొడుతున్న జీవనది గోదావరి.. ఇలాగే సాగితే.!