తెలంగాణ

telangana

ETV Bharat / state

Third wave: పొంచి ఉన్న మూడో దశ.. కొన్ని దేశాల్లో పెరుగుతున్న కేసులు

అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ రాకపోకలు ఇప్పుడు మామూలుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు బ్రిటన్‌, రష్యాలలో విరుచుకుపడుతున్న వైరస్‌.. భారత్‌లో ప్రవేశించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. నిబంధనల ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే.. మూడోదశ ఉద్ధృతిని విస్మరించలేం. దీంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

warning on  covid cases are increased
పొంచి ఉన్న మూడో దశ

By

Published : Oct 27, 2021, 5:12 AM IST

రష్యా, బ్రిటన్‌లలో తాజాగా కేసులు అమాంతంగా పెరుగుతుండడం, చైనాలోనూ మళ్లీ వైరస్‌ కలకలం రేపుతుండడంతో.. మూడోదశ ముప్పు త్వరలోనే భారత్‌లోనూ ఉండనుందా అనే భయాందోళనలు మొదలయ్యాయి. దేశంలో కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. కొవిడ్‌ లేదనే భావన ప్రజల్లో నెలకొంది. దీంతో మాస్కులు ధరించకపోవడం, సురక్షిత దూరాన్ని పాటించకపోవడం సాధారణమైంది. ఈ ధోరణి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేసే ప్రమాదముందని ఇప్పటికే రాష్ట్ర వైద్యశాఖ హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం కూడా పలు సందర్భాల్లో మూడోదశ ముప్పు పొంచి ఉందనే సందేశాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించింది. సాధ్యమైనంత వేగంగా అర్హులైన వారంతా టీకాలను పొందాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది.

నిర్లక్ష్యం పనికి రాదు

గత ఏడాది కొవిడ్‌ తొలిదశ మార్చిలో మొదలైనా.. ఉద్ధృతి మాత్రం మే నుంచి సెప్టెంబరు వరకూ కొనసాగింది. ఆ తర్వాత పండుగలు, శుభకార్యాల పేరిట విచ్చలవిడిగా నిబంధనలను ఉల్లంఘించినా కేసుల సంఖ్య మాత్రం పెరగలేదు. అయితే ఆర్నెల్ల తర్వాత రెండోదశ ఉద్ధృతి ఒక్కసారిగా మొదలైంది. డెల్టా వేరియంట్‌ ప్రవేశంతో ఈ ఏడాది మే-జూన్‌ మాసాల్లో తీవ్ర నష్టం జరిగిపోయింది. రాష్ట్రంలో అధికారిక గణాంకాల ప్రకారమే ఒక్కరోజులో గరిష్ఠంగా 10వేలకు పైగా కేసులు.. 50కిపైగా మరణాలు సంభవించాయి. కేవలం మూడు నెలల్లో చేసిన తీవ్ర నష్టం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. గత మూడు నెలలుగా కేసుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. రాష్ట్రంలో కేసుల నమోదు 0.5 శాతం లోపే ఉంటోంది. రోజుకు 150-200లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో ఒకవైపు ఎన్నికలు, మరోవైపు పండుగలు, శుభకార్యాలు, ఇతర కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. సుమారు 80 శాతానికి పైగా ప్రజలు మాస్కులు ధరించడం లేదని వైద్యశాఖే చెబుతోంది. దాదాపు ఎవరూ సురక్షిత దూరం పాటించడంలేదు. ఈ తరహా నిర్లక్ష్యం మరో ఉద్ధృతికి కారణమయ్యే అవకాశాలకు దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

సర్వసన్నద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మూడోదశ ఉద్ధృతిని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. అత్యవసర కొవిడ్‌ నిధుల కింద కేంద్రం.. రాష్ట్రానికి రూ.456 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో 27,000 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యాన్ని కల్పించారు. పిల్లల్లో కొవిడ్‌ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు వారి కోసం ప్రత్యేక ఐసీయూ పడకల సంఖ్యను పెంచారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం 20 ఐసీయూ పడకలను పిల్లల కోసం కేటాయించారు. అవసరమైన మానవ వనరులను నియమించుకోవడానికి కూడా అనుమతించారు.

ఇదీ చూడండి:

ఉరుముతున్న మూడో ముప్పు- అప్రమత్తతతోనే అడ్డుకట్ట

ABOUT THE AUTHOR

...view details