చారిత్రక నగరం ఓరుగల్లుకు ప్రథమ పౌరుడు ఎవరన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో మేయర్‌ను ఎన్నుకోనున్నారు. మొత్తం 58మంది కార్పొరేటర్లు ఉండగా....తెరాస వైపే 53 మంది సభ్యులు ఉండటం వల్ల మేయర్ ఎన్నిక లాంఛనమే కానుంది. ఇక మేయర్ ఎవరైతే బాగుంటుందన్న దానిపైన అధిష్ఠానం ఈసారి విస్తృత కసరత్తు నిర్వహించింది. ఈ ఎన్నిక బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి బాలమల్లుకి అప్పగించారు.
నేడు ఓరుగల్లు ప్రథమ పౌరుడి ఎన్నిక అధిష్ఠానం ఆదేశాలతో బాలమల్లు వరంగల్‌లో రెండు రోజులు పాటు ఉండి కార్పొరేటర్ల అభిప్రాయాలను సేకరించారు. నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకుల సూచనలను తీసుకొని నివేదిక రూపంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లకు అందించారు.
మేయర్ పదవిపై ఉత్కంఠ..
ఈసారి మేయర్ పదవికి గతంలో ఎప్పుడూ లేనంత పోటీ ఏర్పడింది. ఎక్కువమంది కార్పొరేటర్లు ప్రథమ పౌరుడి పదవిని ఆశించి ఇందుకోసం తమవంతు ప్రయత్నాలు చేశారు. రాజధానిలోనే మకాం వేసి... పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇతర నేతలను కలిసి తమ మనసులోని మాటను తెలియజేశారు. ప్రధానంగా మహిళా కార్పొరేటర్లు తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాల్సిందిగా కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తూర్పు నియోజకవర్గానికే మేయర్ పదవి దక్కాలని కొందరు... పశ్చిమ నియోజకవర్గానికి ఈసారి అవకాశం ఇవ్వాలని కోరడం వల్ల మేయర్ పదవి ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ పెరిగింది.
ఎంపిక చేయనున్న అధిష్ఠానం...
మేయర్‌గా ఎవరిని ఖరారు చేసినా... పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ.. కార్పొరేటర్లు తీర్మానం చేశారు. అనుభవం, సమర్థత, విధేయత, ఎమ్మెల్యేల మద్దతు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. అధిష్ఠానం ఎంపిక చేయనుంది.